Telangana Temperature: మండుతోన్న ఎండలు.. దేశంలోనే తెలంగాణ మూడో స్థానం
రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఎంతగా అంటే దేశంలోనే మూడో స్థానంలో 101 ఫారన్‌హీట్‌లతో ఉంది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, చత్తీస్ ఘడ్..
- Subhan Ali Shaik
- Published On : April 7, 2021 / 07:16 AM IST
Telangana Temperature
Telangana Temperature: రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఎంతగా అంటే దేశంలోనే మూడో స్థానంలో 101 ఫారన్‌హీట్‌లతో ఉంది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, చత్తీస్ ఘడ్ లు నిలిచాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే కొనసాగుతుండగా.. మంగళవారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది.
అర్లి(బి), బేలా, చేప్రాల, జైనథ్, నిర్మల్ జిల్లా విశ్వనాథపేటలో 41.7 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.7 డిగ్రీల నుంచి 41.9 డిగ్రీల వరకూ రికార్డ్ అయినట్లు డేటా నమోదైంది. గాలిలో తేమ ఆదిలాబాద్‌లో 10 శాతమే నమోదుకాగా.. రాష్ట్రంలో సగటు 42 శాతం నుంచి 88 శాతం వరకు నమోదైంది.
ఉష్ణోగ్రత పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి పూట హెచ్చుగా కనిపిస్తుంది. అతి తక్కువగా సంగారెడ్డి జిల్లా అల్లోలెలో 20.6 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 39.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25.8 డిగ్రీలుగా రికార్డయింది. కాగా, తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడింది.
సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల వరకు తమిళనాడు అంతర్భాగం నుంచి కర్ణాటక అంతర్భాగం మీదుగా మరట్వాడా వరకూ మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో నిన్న భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని టీఎస్‌డీపీఎస్ తెలిపింది.
ఏప్రిల్ 9, 10 తేదీల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, సిద్దిపేట, కరీంనగర్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోకూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
