TG TET 2026 : తెలంగాణ టెట్‌కు దరఖాస్తుల వెల్లువ.. హాల్ టికెట్లు, పరీక్షలు ఎప్పుడంటే..? పూర్తి వివరాలు ఇలా..
TG TET 2026 : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు శనివారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది.
- Harishth Thanniru
- Published On : November 30, 2025 / 08:40 AM IST
Telangana TET
TG TET 2026 : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు శనివారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఈసారి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 29వ తేదీ సాయంత్రం 6గంటల వరకు 2,26,956 దరఖాస్తులు అందాయి.. అయితే, శనివారం అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉండటంతో అదనంగా మరో 20వేల వరకు దరఖాస్తులు పెరిగి ఉండొచ్చునని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నాయి.
గత జూన్‌లో నిర్వహించిన టెట్ -2025 తొలి విడతకు 1.83లక్షల ముందే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కేవలం 1.37లక్షల మందే పరీక్షలు రాశారు. అయితే, ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న టీచర్లకుసైతం టెట్ తప్పనిసరి కావడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
శనివారం సాయంత్రం 6గంటల వరకు పేపర్ -1 కోసం 26,788 మంది టీచర్లు దరఖాస్తు చేసుకోగా.. ఇతర అభ్యర్థులు 55,133 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మొత్తం 81,921 మంది పేపర్-1 కోసం దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-2కు 1,45,035 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో టీచర్లు 44,063 మందికాగా.. ఇతర అభ్యర్థులు 1,00,972 మంది ఉన్నారు. రెండు పేపర్లకు (పేపర్-1, పేపర్-2) కలిపి 2,26,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 70,851 మంది టీచర్లు ఉండగా.. 1,56,105 మంది ఇతర అభ్యర్థులు ఉన్నారు. అయితే, శనివారం అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉండటంతో వీటి సంఖ్య మరో 20వేలు పెరిగి ఉంటుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. రెండేళ్లలో టెట్ పాస్ కాకుంటే ఉద్యోగంలో కొనసాగలేరని పేర్కొంది. అయితే, సుప్రీంతీర్పుపై ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో విద్యాహక్కు చట్టాన్ని సవరించి.. ఆ చట్టం రాకముందే ఉద్యోగంలో చేరిన వారికి టెట్ మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. అయితే, ప్రస్తుతం మాత్రం ముందస్తు జాగ్రత్తగా ఉపాధ్యాయులు టెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఇదిలాఉంటే.. డిసెంబర్ 27వ తేదీన టీజీ టెట్-2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. 2026 జనవరి 3 నుంచి 31 తేదీల మధ్యలో పరీక్షలు జరగనున్నాయి. టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు.
టెట్ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. టెట్ ఎగ్జామ్ లో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
