Telangana Rains : తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాల హెచ్చరిక.. హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు అలర్ట్

Telangana Rain alert : తెలంగాణలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది

Telangana Weather Alert Heavy Rains in Hyderabad

  • తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు
  • ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం
  • అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Telangana Rain Alert : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌సహా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. సుమారు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. అయితే, ఇవాళ (శనివారం) కూడా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read – Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే రెండు రోజులు అత్యంత కీలకమని అధికారులు వెల్లడించారు. శని, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు కొనసాగుతాయని.. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా పెద్దవూర మండలం పులిచెర్లలో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడవిదేవులపల్లి మండలం ముల్కచర్లలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోనూ వర్షం దంచికొట్టింది. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీ వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే మరోవైపు.. పలు ప్రాతాల్లో వడగాలులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండగా.. ఇంకోవైపు వేడిగాలులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలోని 16 జిల్లాల పరిధిలో 63 మండలాల్లో శుక్రవారం వడగాలులు వీచాయి. నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు నమోదయ్యాయి. శని, ఆదివారాల్లోనూ పలు ప్రాంతాల్లో వడగాలులు తీవ్రత ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.