Telangana Exams
Telangana Exams: తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ వాయిదాపడ్డాయి. కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఎగ్జామ్స్‌కు సంబంధించి అన్ని వర్సిటీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్షల తేదీలను ప్రకటిస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మూసేస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు మాత్రం జరుగుతాయని పలు వర్సిటీలు అధికారికంగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బుధవారం సమీక్షించిన ఉన్నత విద్యామండలి సెమిస్టర్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలని వర్సిటీలకు సూచించింది.
కాలేజీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్‌ఛార్జి కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ సైతం డైరక్ట్ క్లాసెస్, ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలని ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 11 గవర్నమెంట్ యూనివర్సిటీలతోపాటు మరో 5 ప్రైవేట్ వర్సిటీల రిజిష్ట్రార్లకు ఆదేశాలు చేశారు.
వాయిదా వేస్తూ వర్సిటీల నిర్ణయం
> JNTUH పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న రెగ్యూలర్, సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.మంజూర్ హుస్సేన్ తెలిపారు.
> ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రకటించింది. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ లేదా 040-23680241కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని రిజిస్ట్రార్ డాక్టర్ జి.లక్ష్మారెడ్డి తెలిపారు.
> ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుతం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలన్నింటినీ వాయిదా వేశామని రిజిస్ట్రార్ వివరించారు.