TGIIC Osman Nagar Auction : హైదరాబాద్ లో ఆ ఏరియా మరో కోకాపేట.. అక్కడ ఎకరం ఏకంగా రూ.51 కోట్లు
TGIIC Osman Nagar Land Auction : హైదరాబాద్ లో భూములకు ఎంత డిమాండ్ ఉందో తాజాగా నిర్వహించిన వేలం చూస్తే అర్థం అవుతుంది.
- Dharani Pilli
- Updated on- April 24, 2026 / 06:11 PM IST
TGIIC earns RS 517 crore in 10 09 acre land auction in Osman Sagar Hyderabad
Osman Nagar Auction : హైదరాబాద్ నగరంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎకరం భూమి కొనాలంటే కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా నగరంలో 10 ఎకరాల భూమిని ఒక సంస్థ ఏకంగా రూ. 517 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ఓస్మాన్‌సాగర్ పరిధిలో 10.09 ఎకరాల భూమికి వేలం వేయగా.. రికార్డు స్థాయిలో రూ. 517 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే ఎకరాకు సగటున రూ. 51.25 కోట్లు ధర పలికింది.
ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ రాజపుష్ప సంస్థ 10.09 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ నంబర్ 1ను దక్కించుకుంది. ఈ వేలంలో అనేక ప్లాట్లు ఉండగా, రాజపుష్ప సక్సెస్‌ఫుల్ బిడ్డర్‌గా నిలిచింది. మరోవైపు, 5.72 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ నంబర్ 6కు ఎకరాకు రూ. 44 కోట్లు చొప్పున బిడ్లు వచ్చాయి. ఈ వేలంలో సగటున ఎకరాకు రూ. 48.6 కోట్ల ఆదాయం లభించిందని, ఇది మార్కెట్ ప్రతిస్పందనను మరియు ధరల నిర్ణయ సామర్థ్యాన్ని తెలియజేస్తుందని TGIIC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధి పథంపై మరియు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
