TGSRTC Special Buses : దసరాకు ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్.. టీజీఎస్ఆర్టీసీ 7వేల స్పెషల్ బస్సులు.. ఫుల్ డీటెయిల్స్..
TGSRTC Special Buses : పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ఆర్టీసీ 7వేల స్పెషల్ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.
- Harish Thanniru
- Updated on- October 7, 2026 / 07:56 PM IST
TGSRTC Special Buses
TGSRTC Special Buses : దసరా పండుగ సందడి మొదలైంది. మరో రెండుమూడు రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. దీంతో పట్టణాల్లో నివాసం ఉండే ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది.
పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ఆర్టీసీ 7వేల స్పెషల్ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇందులో కరీంనగర్ జోన్ పరిధిలో మొత్తం 3,533 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. రీజియన్ల వారీగా ఆదిలాబాద్ నుంచి 431, నిజామాబాద్ నుంచి 719, కరీంనగర్ నుంచి 1,175, వరంగల్ నుంచి 530, ఖమ్మం నుంచి 678 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ జోన్ నుంచి 2,155 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. వీటిలో మహబూబ్‌నగర్ రీజియన్ నుంచి 645, మెదక్ నుంచి 255, నల్గొండ నుంచి 815, రంగారెడ్డి నుంచి 440 ప్రత్యేక సర్వీసులు ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో మరో 1,312 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.
ముఖ్యంగా 9, 10, 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఆయా రోజుల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్,ర తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా దసరా పండుగ వేళ నడిపించే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్, స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు.
అయితే, ఈ ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు సంస్థ వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని యాజమాన్యం సూచించింది.
