TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎయిర్పోర్ట్ లెవల్లో 86 కొత్త బస్ స్టాండ్స్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా(TGSRTC) బస్ స్టేషన్లలో సీసీటీవీల పర్యవేక్షణ ద్వారా సేవలను మరింత పునర్వ్యవస్థీకరించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
- V Santhosh Kumar
- Published on- November 10, 2026 / 06:50 PM IST
Tgsrtc passenger amenities upgrade and cctv cameras in 86 bus stations
TGSRTC: రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో ప్రయాణించే పౌరులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే ప్రధాన ధ్యేయంగా ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ’ (TGSRTC) మరో బృహత్తర చర్యకు శ్రీకారం చుట్టింది. రోజువారీగా కనీసం 5,000 మందికి పైగా ప్రయాణికుల రద్దీ ఉండే రాష్ట్రంలోని 86 ప్రధాన బస్ స్టేషన్లను సంస్థ ప్రత్యేకంగా గుర్తించి, రద్దీ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టడంతో పాటు అధునాతన ప్రయాణీకుల సమాచార, ప్రసార సౌకర్యాలను కల్పించేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసింది.
కంట్రోలర్ల నియామకం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్.. సేవలు మరింత వేగవంతం:
ఈ గుర్తించిన 86 బస్ స్టేషన్లలో ప్రయాణికుల సేవలు, సమాచార సేకరణ కోసం ప్రత్యేకంగా ఒక కంట్రోలర్‌ను నియమించడంతో పాటూ ప్రత్యక్ష విచారణ సంప్రదింపు నంబర్లను ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తెచ్చింది. మొదటి, చివరి బస్సు సర్వీసుల వేళలను క్రమం తప్పకుండా తెలియజేసేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ (PAS) తో పాటు కొత్త టైమ్‌టేబుల్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు ఎలాంటి గందరగోళం లేకుండా బస్సుల రాకపోకల సమయాలను ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలుసుకునేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
సీసీటీవీలతో కేంద్రీకృత పర్యవేక్షణ.. ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడి:
ప్రయాణికుల భద్రత, రద్దీ పర్యవేక్షణ కోసం బస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చి, వాటిని ప్రాంతీయ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయానికి నేరుగా అనుసంధానించాలని నిర్ణయించారు. దీని ద్వారా కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి ప్రతి కార్యకలాపాన్ని నిరంతరం పరిశీలిస్తామని సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ప్రజా రవాణా సేవలను మరింత బలోపేతం చేసి ప్రజలకు విశ్వసనీయమైన సేవలు అందించడానికే ఈ సంస్కరణలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
