Mahesh Kumar
Mahesh Kumar Goud : డి.శ్రీనివాస్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరినట్లు మళ్లీ, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. డి.శ్రీనివాస్ రాజీనామా వ్యవహారంపై ఆ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. డి.ఎస్ కాంగ్రెస్ లో చేరడం వల్ల పార్టీకి ఎలాంటి లాభం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన నిజామాబాద్ లో 10 టీవీతో మాట్లాడారు. పెద్దాయనగా పార్టీలోకి వస్తే స్వాగతించామని చెప్పారు. కొడుకుల మధ్య నలిగిపోతారని ఊహించలేదన్నారు.
డి.ఎస్ రాజీనామా ఆ కుటుంబం సభ్యుల తగాదని, తమ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. డీ.ఎస్ యొక్క ఆ ఇద్దరు కొడుకుల తగాదా తమకు ఎందుకు అని అన్నారు. గాంధీ భవన్ తమకు దేవాలయంతో సమానం అన్నారు. ఎవరు వచ్చినా గాంధీ భవన్ లోనే చేర్చుకుంటామని చెప్పారు. ఇద్దరు కొడుకుల మధ్య డి.ఎస్ నలిగిపోతున్నారని పేర్కొన్నారు.
ఇద్దరి మధ్య ఆస్తి, రాజకీయ తగాదాలు ఉన్నాయని ఆరోపించారు. ఒత్తిడి వల్ల డి.ఎస్ రాజీనామా చేసినట్లు తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ లేనిదే డి.ఎస్ లేరు, ఆయన కొడుకులు లేరని ఆ విషయాన్ని అర్వింద్ గుర్తించాలని సూచించారు. అర్వింద్ అనుభవించే అస్థి కాంగ్రెస్ పుణ్యమని వెల్లడించారు.