Dharani
తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ మూడో సమావేశం ఇవాళ హైదరాబాద్, నాంపల్లిలోని సీసీఎల్‌ఏ భవనంలోని ఆఫీసులో జరిగింది. ధరణి డేటాను పరిశీలించడం, ఆ పోర్టల్‌లో చేయాల్సిన సాంకేతిక మార్పులను గురించి చర్చించారు.
అనంతరం ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ధరణిలో ఉన్న లొసుగులపై చర్చించినట్లు తెలిపారు. దీనిపై ఎల్లుండి కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అలాగే, గ్రామాల్లో పర్యటిస్తామని అన్నారు. భూ యజమానుల నుంచి సూచనలు తీసుకుంటామని తెలిపారు.
త్వరలోనే స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖతోనూ సమావేశం ఉంటుందని వివరించారు. ధరణిపై వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఇబ్బందులు రాకుండా చూసుకోవడమూ అంతే ముఖ్యమని చెప్పారు. భూ వ్యవహారాలతో సంబంధం ఉన్న అన్ని శాఖలతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
తమ కమిటీ ఏ సమస్యనూ పరిష్కరించదని, నివేదికను మాత్రమే సిద్ధం చేస్తుందని వివరించారు. ధరణిలోనే కాకుండా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, వ్యవసాయం ఇలా చాలా శాఖలతో చర్చించి, వారు సహకరిస్తే స్పష్టమైన నివేది సిద్ధం అవుతుందని అన్నారు. కేవలం మూడు సమావేశాలతో తేలేది ఏమీ ఉండదని చెప్పారు.
భూ యజమానికి తెలియకుండానే లావాదేవీలు
భూ యజమానికి తెలియకుండానే భూ లావాదేవీలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. భూ రికార్డుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని ధరణి కమిటీ సభ్యుడు సునీల్ కూడా చెప్పారు. ధరణిపై చాలా కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ధరణి ప్రారంభం నుంచే అనేక లోపాలు ఉన్నాయని ధరణి కమిటీ మరో సభ్యుడు కోదండ రెడ్డి చెప్పారు.
ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు.. నిమిషానికో మాట మార్చే రకం: కోమటిరెడ్డి, జగదీష్ రెడ్డి వాగ్యుద్ధం