ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు.. నిమిషానికో మాట మార్చే రకం: కోమటిరెడ్డి, జగదీష్ రెడ్డి వాగ్యుద్ధం
యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెట్టే పాత రోజులు మళ్ళీ వచ్చాయి. ముందు ఆ సమస్యపై దృష్టి పెట్టండి. రైతు బంధు ఇంకా రాకపోవడంపై అన్నదాతల్లో ఆందోళన ఉంది.

komatireddy venkat reddy, Jagadish reddy war of words
Komatireddy Venkat Reddy: తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే.. ఎప్పుడేం మాట్లాడుతారో కోమటిరెడ్డికి తెలియదని, నిమిషానికో మాట మార్చే రకమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరు నాయకులు సోమవారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ.. పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చి ఎమ్మెల్యే అయ్యారని కోమటి రెడ్డి వ్యాఖ్యానించగా.. కోమటిరెడ్డిని కాంగ్రెస్ లో కోవర్టు అని ఆ పార్టీ నేతలే అంటారని జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా ఎమ్మెల్యే
నల్గొండ కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి మంచి అవకాశం. గతంలో ప్రగతి భవన్ గేటు దగ్గరకు వెళ్లాలంటే కూడా కష్టంగా ఉండేది. మంత్రులకు కూడా ప్రగతి భవన్ లోకి అనుమతి లేదు. ఇవ్వాళ ప్రజలు స్వేచ్ఛగా ప్రగతి భవన్ లోకి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నరు. గతంలో ఇదే వ్యవస్థ ఉండేది.. బీఆర్ఎస్ వచ్చి దానికి మంగళం పాడింది. ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన ఎమ్మెల్యే అయ్యారు. విద్యుత్ సంస్థలకు నష్టాలు వచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు ఆషామాషీగా తీసుకోవద్దు. నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటాం. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ తో లక్ష కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. గత సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే కృష్ణానది నీటి నిర్వహణ కేఆర్ఎంబీకి వెళ్ళింది. ఎస్సెల్బిసి ప్రాజెక్ట్ ను గత ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే పక్కన పెట్టింది. ఈ ఐదేళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసే బాధ్యత మాదని అన్నారు.
కొట్లాడే దమ్ము కాంగ్రెస్ కు ఉందా?
మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకు తెలియదని, నిమిషానికో మాట మార్చే రకమంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయిలేక మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. అధికారంలోకి వస్తామని నమ్మకం లేక కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చారు. హామీల అమలును ప్రశ్నిస్తే వారికి అసహనం పెరుగుతోంది. మా మీద కోపం ఉంటే తీర్చుకోండి. రాష్ట్రాన్ని నష్టం పరిచే చర్యలు చేయకండి. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దని కోమటి రెడ్డి చెప్పిన దాన్నే కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ నిజం చెబితే కోమటి రెడ్డి చిన్న పెద్దా లేకుండా మాట్లాడుతున్నారు. కోమటి రెడ్డిని కాంగ్రెస్ లో కోవర్టు అని ఆ పార్టీ నేతలే అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ అభ్యర్థి అయిన తమ్ముడికి ఓట్లేయమని చెప్పింది కోమటి రెడ్డి. బీఆర్ఎస్ ను 39 ముక్కలు చేస్తా అంటున్నారు. కోమటి రెడ్డి తాత తరం కూడా కాదు బీఆర్ఎస్ ను అంతం చేయడం. కోమటి రెడ్డి లాంటి వాళ్ళెందరో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, సాధ్యం కాలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి గురువు వల్ల కూడా ఆ పని కాలేదు.
Also Read: కవిత మళ్లీ నిజామాబాద్ పార్లమెంటు బరిలోకి దిగుతారా, లేదా?
అధికారిక రివ్యూకి వెళ్లి కోమటి రెడ్డి అనవసర విషయాలు మాట్లాడారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెట్టే పాత రోజులు మళ్ళీ వచ్చాయి. ముందు ఆ సమస్యపై దృష్టి పెట్టండి. రైతు బంధు ఇంకా రాకపోవడంపై అన్నదాతల్లో ఆందోళన ఉంది. అప్రకటిత కరెంటు కోతలు పెరిగి పోయాయి. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది.. కొట్లాడే దమ్ము కాంగ్రెస్ కు ఉందా? తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ ను ముక్కలు చేయడం కాదు.. మీ బాసో నువ్వో మరో ఏక్ నాథ్ షిండే అవుతావు. కాంగ్రెస్ కు అధికారం ఇచ్చింది పార్టీలను చీల్చడానికి కాదు. ప్రజలే కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతారు. కేసీఆర్ వల్లే సాగర్ లో నీళ్ల సమస్య వచ్చింది అంటున్నారు.. పాలన చేత కాకుంటే తప్పుకోండి. కోమటి రెడ్డి కి సిగ్గుండాలి.. తప్పుడు మాటలు మాట్లాడడానికి. వాళ్ళు ఎపుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. నిరసనలకు మేము తొందర పడటం లేదు. ప్రజలే సమస్యలపై రోడ్ల పైకి వస్తారు. పార్లమెంటు ఎన్నికల్లో మేమే మెజారిటీ సీట్లు గెలుస్తామని జగదీష్ రెడ్డి అన్నారు.
Also Read: కాంగ్రెస్, బీజేపీ సంబంధం గురించి ప్రజలకు చెప్పండి.. కరెంట్ బిల్లులన్నీ కోమటిరెడ్డికి పంపించండి