మూసీ ప్రాజెక్టును ఆపేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కై కుట్ర: మహేశ్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ గ్రాఫ్ పడిన ప్రతి సారి కిషన్ రెడ్డి బయటకి వస్తున్నారని మహేశ్ కుమార్ తెలిపారు.

Mahesh Kumar Goud

మూసీ ప్రాజెక్టును ఆపేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ… మూసీ వద్ద బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల మందు, ఈగల మందు కొట్టారని మహేశ్ కుమార్‌ గౌడ్ తెలిపారు.

మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయని అన్నారు. మూసీ పక్కన మూడు నెలల బస చేయండి అని సీఎం సవాల్‌ విసిరారని తెలిపారు. అక్కడి ప్రజలు అనారోగ్యాల పాలు అవుతున్నారని అన్నారు.

బీఆర్ఎస్ గ్రాఫ్ పడిన ప్రతి సారి కిషన్ రెడ్డి బయటకి వస్తున్నారని మహేశ్ కుమార్ తెలిపారు. బీఆర్‌ఎస్‌ను ప్రొటెక్ట్ చేయడానికి కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒక్కరోజు నిద్ర చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీశారు. సబర్మతి రివర్ ఫ్రంట్ కి ఒక న్యాయం.. మూసీ రివర్ కి ఒక న్యాయమా..? మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకుంటాం అని వ్యాఖ్యానించారు.