Hyderabad Traffic : హైదరాబాద్‌ టెకీల ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌!

Traffic Problems May Clear Hyderabad It Employees

Hyderabad IT Employees : మహానగర వాసుల ట్రాఫిక్‌ కష్టాలు మరింత తీరనున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటలు గంటలు వెయిట్‌ చేసే తిప్పలకు సర్కార్‌ ఒక్కొక్కటిగా చెక్ పెడుతోంది. కోట్ల వ్యయంతో అండర్‌ పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తుండగా.. ఇవాళ మరో రైల్వే అండర్‌ బ్రిడ్జి హైదరాబాద్‌ ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చనుంది. మరి ఆ అండర్‌ పాస్‌ ప్రత్యేకతలేంటి..? తీరనున్న సమస్యలేంటి..? హైదరాబాద్‌లో ట్రాఫిక్ జంజాటానికి సర్కార్‌ చెక్‌ పెడుతోంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ది పథకంలోని ఫలితాలు ఒక్కొక్కటిగా సిటిజన్లకు అందుతున్నాయి. నగరంలో వివిధ ప్రాంతాల్లోని జంక్షన్ల వద్ద భారీ ట్రాఫిక్ జామ్‌లతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే నగర వాసులకు ఇప్పుడిప్పుడే ఉపశమనం కలుగుతోంది.

హైదరాబాద్‌లో మరో ప్రాజెక్టు నగర వాసులకు అందుబాటులోకి రానుంది. 66.59 కోట్ల వ్యయంతో నిర్మించిన హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్‌యూబీ అందుబాటులోకి వస్తే కూకట్‌పల్లి – హైటెక్ సిటీ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది. ఈ మార్గంలో లాక్‌డౌన్‌కు ముందు నిత్యం 5 నుంచి 6 లక్షల వాహనాలు రాకపోకలు సాగించేవని పోలీసులు అంచనా. ఇప్పటికే స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌లో భాగంగా మొదటి దశలో గచ్చిబౌలి నుంచి జేఎన్‌టీయూ వరకు చేపట్టిన పలు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు.. బయోడైవర్సిటీ, మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్‌గాంధీ జంక్షన్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

హైటెక్ సిటీ ఆర్‌యూబీ నిర్మాణానికి ముందు శేరిలింగంపల్లి నుంచి వచ్చే వరద నీరు ఈ బ్రిడ్జి కింద నుంచే వెళ్లేది. ఈ నీటితో అండర్ బ్రిడ్జి ఎప్పుడూ నీటితో నిండి ఉండేది. ఇక, భారీ వర్షాలు పడితే అక్కడి పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ నీటిని నిల్వ చేసేందుకు బ్రిడ్జి కింద పెద్ద సంపును నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట్ సర్కిల్‌లో నాటిన హరితహారం మొక్కలకు నీరందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1 వేయి 10 కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో చేపట్టిన ఈ తరహా 18 ప్రాజెక్టులు నగర పౌరులకు అందుబాటులోకి వచ్చాయి. 4 వేల 741.97 కోట్ల వ్యయంతో చేపడుతున్న మరో 20 పనులు నిర్మాణ దశలో ఉన్నాయి.