Suryapet District : సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఇద్దరు ప్రాణాలు బలిగొన్న వేపచెట్టు.. ఎస్ఐకుసైతం తీవ్రగాయాలు

Suryapet District : సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేపచెట్టు విషయంలో మొదలైన వివాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Suryapet district Tragic incident

Suryapet District : సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేపచెట్టు విషయంలో మొదలైన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలుగా విడిపోయిన కుటుంబ సభ్యులు గొడ్డళ్లతో పరస్సరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఘర్షణను అదుపు చేసేందుకు వెళ్లిన ఎస్ఐకు తీవ్ర గాయాలయ్యాయి. మేళ్ల చెరువు మండలం ఎర్రగడ్డ తండాలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Visakhapatnam : విశాఖలో విషాదం.. ఇద్దరు చిన్నారులుసహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో వేపచెట్టు విషయంలో వెంకటేశ్వర్లు, సైదా ఇద్దరూ గొడవ పడ్డారు. ఆ తరువాత కుటుంబ సభ్యులు కూడా వచ్చి చేరడంతో ఆ గొడవ మరింత పెద్దదైంది. ఇరువర్గాల మధ్య క్రమంగా మాటామాటా పెరగడంతో ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. రెండు వర్గాల వారు కర్రలు, గొడ్డళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడి ఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా.. సైదాకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు సైదాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.

ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి వెళ్లి పరిస్థితిని కంట్రోల్ లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల వారిని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు మేళ్లచెరువు ఎస్ఐ నవీన్‌పైనా దాడికి పాల్పడ్డారు. గొడ్డలితో ఎస్ఐపై దాడి చేయడంతో అతని తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. గాయపడిన వాళ్లతో కలిపి ఎస్ఐను ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తండాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోసారి ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకుండా పెద్ద సంఖ్యలో పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నాయి.