Transfer of Collectors of several Districts in Telangana : తెలంగాణలోని పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పి.వెంకట రామిరెడ్డి మళ్లీ నియమితులయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ను సిద్దిపేట జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు గత నెలలో బదిలీ చేసింది ప్రభుత్వం. ఎన్నికలు పూర్తి కావడంతో ఆయనను సిద్దిపేట కలెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే మెదక్ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
ఎన్నికలకు ముందు మెదక్ జిల్లా కలెక్టర్‌గా వెళ్లిన సంగారెడ్డి కలెక్టర్ ఎం.హన్మంతరావును మళ్లీ సంగారెడ్డికి బదిలీ చేశారు. ఎన్నికలకు ముందు సిద్దిపేట కలెక్టర్‌గా స్థానచలనం పొందిన మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికెరిని తిరిగి మంచిర్యాలకు బదిలీ చేశారు. మంచిర్యాల కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిక్తా పట్నాయక్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. పెద్దపల్లి కలెక్టర్‌గా అదనపు బాధ్యతల నుంచి శశాంకను కూడా రిలీవ్ చేశారు.
ఆ స్థానంలో హోళికెరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇక హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు.