Zaheerabad Lok Sabha Constituency : సై అంటే సై.. జహీరాబాద్‌ ఎంపీ సీటులో 3 పార్టీల మధ్య ఉత్కంఠ పోరు

అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం కలవరపెడుతుండగా, మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచినా... ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలతో బీఆర్‌ఎస్‌ డిఫెన్స్‌లో పడిపోయింది. ఇక ఈ రెండు పార్టీలను వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు దూసుకొస్తుందా? అంటే అదీ చెప్పలేదని పరిస్థితి.

Zaheerabad Lok Sabha Constituency : అది బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం.. వరుసగా రెండు సార్లు అక్కడ గెలిచిన ఎంపీ మూడోసారి పోటీకి సై అంటున్నారు. కానీ, రెండుసార్లు గెలిపించిన పార్టీకి హ్యాండిచ్చి.. కొత్త పార్టీ ద్వారా మూడోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక ఆ ఎంపీకి ప్రత్యర్థిగా దిగిన మరో మాజీ ఎంపీ అసెంబ్లీ ఎన్నికల తీర్పుతో సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరిని ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకున్న మరో పార్టీ ఉద్యమ నేతను బరిలోకి దించి తమ పట్టు చెక్కు చెదరలేదని నిరూపించాలని అనుకుంటోంది. ఇలా మూడు పార్టీలు ఎన్నికల యుద్ధానికి దిగడంతో ఆ నియోజకవర్గంలో పోటీ నువ్వా-నేనా అన్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? పొలిటికల్‌ ట్విస్టులిస్తున్న ఆ నేతలు ఎవరు?

3 సార్లు లింగాయత్‌ నాయకులదే గెలుపు..
తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గం జహీరాబాద్. 2009లో ఏర్పడిన జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఈ సారి పొలిటికల్‌ హీట్‌ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. బీసీలు, లింగాయత్‌లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈ సారి ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్‌ గెలిస్తే, మిగిలిన రెండుసార్లు బీఆర్‌ఎస్‌ పార్టీయే గెలిచింది. ఐతే ఈ మూడు సార్లు లింగాయత్‌ నాయకులే విజయపతాకం ఎగరేయడం… తాజా ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందనే ఉత్కంఠ రేపుతోంది.

కాంగ్రెస్ కంచుకోటలో కారు జోరు..
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డితోపాటు సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్‌ పరిధిలోకి వస్తాయి. ఇందులో కొన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట. ఐతే గత రెండు ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో విజయం కారు పార్టీనే వరించింది. ఐతే ఈ సారి సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ కొద్దిరోజుల క్రితమే సొంత పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆ వెంటనే బీజేపీలో చేరి.. కమలం కండువా కప్పుకున్న రోజునే టికెట్‌ దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌కే టికెట్‌ ఖరారైంది. సిట్టింగ్‌ ఎంపీ హ్యాండివ్వడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన గాలి అనిల్‌కుమార్‌ను బరిలోకి దింపుతోంది.

జహీరాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 14 లక్షల 98 వేల 666 ఓట్లు ఉన్నాయి. వీరిలో ఎక్కువ శాతం మున్నూరు కాపు, లింగాయత్‌లే ఉన్నారు. 2019లో 69.69 శాతం పోలింగ్ నమోదవగా, లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన బీ.బీ.పాటిల్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నాలుగు చోట్ల, బీఆర్ఎస్ రెండు చోట్ల బీజేపీ ఒక చోట గెలిచాయి.

రేవంత్, కేసీఆర్ ఓటమి..
ఇక ఈ నియోజకవర్గం పరిధిలో కామారెడ్డి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఇద్దరిని ఓడించిన బీజేపీ నేత వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ఫలితాలను విశ్లేషిస్తే ఏడు నియోజవర్గాల్లో మొత్తం ఓట్లలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య స్వల్ప తేడా మాత్రమే కనిపిస్తోంది. ఇక మూడో స్థానంలో ఉన్న బీజేపీ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు వచ్చిన ఓట్లలో సగం కూడా తెచ్చుకోలేకపోయింది. ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 5 లక్షల 47 వేల 10 ఓట్లు వచ్చాయి. అదే విధంగా బీఆర్ఎస్‌కి 5 లక్షల 29 వేల 547 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీకి లక్ష 71 వేల 100 ఓట్లు పోలయ్యాయి.

ఇచ్చిన మాట ప్రకారం షెట్కార్ కి టికెట్…
ఇక పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాటిచ్చినట్లే మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌కి టికెట్‌ ఇచ్చింది. నారాయణ్‌ఖేడ్‌ నుంచి ఎమ్మెల్యేగా పార్టీ టికెట్‌ ఇచ్చినా, ఎంపీగా పోటీ కోసం ఆ సీటును వదులుకున్నారు సురేశ్‌ షెట్కార్‌. అంతేకాకుండా మాటపై నిలబడి నారాయణఖేడ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకున్నారు. 2009లో జహీరాబాద్‌ తొలి ఎంపీగా గెలిచిన సురేశ్‌ షెట్కార్‌ లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన వారు కావడం.. ఆ వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆశలు పెట్టుకుంటోంది కాంగ్రెస్‌.

బీజేపీని ఆదరిస్తారా?
ఇక గత రెండు సార్లు కారు గుర్తుపై గెలిచిన ఎంపీ బీ.బీ.పాటిల్‌ ఈ సారి కమలం గుర్తును ఎంచుకున్నారు. ఈయన కూడా లింగాయత్‌ సామాజికవర్గ నేతే.. దీంతో గత రెండుసార్లు గెలిపించిన ఓటర్లు.. ఈ సారి ఆదరిస్తారనే ధీమా కనబరుస్తున్నారు. ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచిన బీజేపీ.. మిగిలిన రెండు పార్టీలను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం దక్కించుకోవడం ఎలా అన్నదే సందేహాలు రేకెత్తిస్తున్నది. ప్రధాని మోదీ ఇమేజ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వ పనితీరుతో జహీరాబాద్‌లో కాషాయ జెండా ఎగరేస్తానని అంటున్నారు బీ.బీ. పాటిల్‌.

హ్యాట్రిక్ విక్టరీ కోసం బీఆర్ఎస్ పక్కా ప్రణాళిక..
కాంగ్రెస్‌, బీజేపీ ఆశలు అలా ఉంటే.. గత రెండుసార్లు వరుస విజయాలు సాధించిన బీఆర్‌ఎస్‌.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని భావిస్తోంది. ఎంపీ బీ.బీ.పాటిల్‌ పార్టీని వీడినా.. సంస్థాగతంగా తమ పార్టీకే బలం ఉందని నమ్ముతున్న బీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రణాళిక రచిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన గాలి అనిల్‌కుమార్‌కు టికెట్‌ ఇచ్చింది. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన అనిల్‌కుమార్‌…. అసెంబ్లీ ఎన్నికల ముందువరకు కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆ ఎన్నికల్లో పోటీకి అనిల్‌కుమార్‌కు అవకాశం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలోనూ అనిల్‌కుమార్‌ అభిమానులు ఉంటారనే ఆలోచనతో… కాంగ్రెస్‌ ఓటును చీల్చవచ్చనే ఉద్దేశంతో అనిల్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది బీఆర్‌ఎస్‌.

ఆ వర్గం ఓట్లు చీలిపోయే చాన్స్‌ ఉందని భావిస్తున్న బీఆర్‌ఎస్‌..
అంతేకాకుండా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో లింగాయత్‌లతో సమానంగా మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి. బీజేపీ, కాంగ్రెస్ లింగాయత్ నేతలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆ వర్గం ఓట్లు చీలిపోయే చాన్స్‌ ఉందని భావిస్తోంది బీఆర్‌ఎస్‌. లింగాయత్‌ ఓట్లు చీలితే మున్నూరుకాపు ఓట్ల బలంతో జహీరాబాద్‌లో గులాబీ జెండా ఎగరేయొచ్చనే వ్యూహంతో అనిల్‌కుమార్‌ను బరిలోకి దింపింది గులాబీ పార్టీ.

ఆ 2 పార్టీలను వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు దూసుకొస్తుందా?
మొత్తానికి జహీరాబాద్‌ గడ్డపై మూడుపార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రధానంగా ఏ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుందంటే చెప్పలేని పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం కలవరపెడుతుండగా, మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచినా… ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలతో బీఆర్‌ఎస్‌ డిఫెన్స్‌లో పడిపోయింది. ఇక ఈ రెండు పార్టీలను వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు దూసుకొస్తుందా? అంటే అదీ చెప్పలేదని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం పోలైన ఓట్లలో మూడో వంతు ఓట్లు కూడా సాధించలేకపోయిన బీజేపీ.. ఈ ఎన్నికల నాటికి ఎలాంటి మార్పు తీసుకొస్తుందనే సందేహం వ్యక్తమవుతోంది. మొత్తానికి మూడు పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతుండటం హీట్‌ పుట్టిస్తోంది.

Also Read : ఈ ఆరు సీట్లపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్‌.. పార్టీ నుంచి వెళ్లిన నేతలను ఓడించేందుకు..

 

ట్రెండింగ్ వార్తలు