Underground Parking: ఇకపై మల్టీప్లెక్స్ అండర్ గ్రౌండ్ పార్కింగ్‌కు నో పర్మిషన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించబోయే మల్టీప్లెక్స్ బిల్డింగుల్లో అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను ఏర్పాటు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం వెల్లడించింది.

Underground Parking Permissions Prohibited For Multiplex In Telangana

Underground Parking: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించబోయే మల్టీప్లెక్స్ బిల్డింగుల్లో అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను ఏర్పాటు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం వెల్లడించింది. మొదటి 5 అంతస్తుల వరకు మాత్రమే పార్కింగ్‌ వాడుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. పోడియం పార్కింగ్‌గా పేర్కొంటున్న దీనికే పర్మిషన్ ఇచ్చింది. ముంబై లాంటి మహానగరంలో ఇప్పటికే ఈ వ్యవస్థ అమల్లో ఉంది. అయిదు అంతస్తుల్లో కూడా సరిపోకపోతే రెండు బేస్‌మెంట్‌లకు అనుమతివ్వనున్నట్టు పేర్కొంది. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే బిల్డింగ్ ఓనర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

వర్షాల సమయంలో సెల్లార్లలో భారీగా నీరు చేరి ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కొత్త విధానం అమల్లోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని మాదాపూర్‌, గచ్చిబౌలిలాంటి అనేక ప్రాంతాల్లో భూగర్భ పార్కింగ్‌లోకి నీరు చేరి ఇబ్బంది తలెత్తింది.

చెరువుల్లో డంప్‌ చేస్తుండటంతో:
పార్కింగ్‌ నిర్మాణం కోసం చేపట్టే తవ్వకాలతో వచ్చే వేలాది లారీల మట్టిని ఎక్కడ డంప్‌ చేయాలనేది నిర్మాణదారులకు సమస్యగా మారింది. అలా తీసిన మట్టిని నాలాలు, చెరువుల్లో డంప్‌ చేస్తుండటంతో అవి పూడుకుపోయి నీరు ముందుకుసాగని పరిస్థితి ఏర్పడింది. దీనిపై క్రెడాయ్‌ కూడా ఇటీవల ప్రభుత్వంతో చర్చించింది.

హైలెవల్ మీటింగ్ తరువాత అండర్ గ్రౌండ్ పార్కింగ్‌పై నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2012లో రూపొందించిన బిల్డింగ్‌ రూల్స్‌ను సవరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. శనివారం రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్‌వింద్ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

బిల్డింగ్ ముందు భాగంలో ప్రహరీ:
ఎకరం ఆపైన నిర్మించే భవన సముదాయంలో రోడ్డు విస్తీర్ణాన్ని బట్టి భవనం ఎంత ఎత్తులో నిర్మించాలన్నది అధికారులు నిర్ధారిస్తారు. ‘భవనం ఎత్తు 55 మీటర్ల లోపు ఉంటే 7 మీటర్ల సెట్‌బ్యాక్‌ ఉండాలి. ఆ తర్వాత వాటికి 9 మీటర్ల సెట్‌బ్యాక్‌ ఉండాలి. బిల్డింగ్ ముందు భాగంలో ప్రహరీ నిర్మించకూడదు. ఈ భవన సముదాయానికి వచ్చే వాహనదారు సెట్‌ బ్యాక్‌ స్థలంలో వాహనాన్ని ఆపేలా ఏర్పాట్లు ఉండాలి’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.