Warangal Collector Gopi : స్టూడెంట్‌గా మారిన కలెక్టర్.. క్లాస్ రూమ్‌లో విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు

వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి కాసేపు స్టూడెంట్ గా మారారు. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చుని టీచర్లు ఎలా బోధన చేస్తున్నారో పరిశీలించారు కలెక్టర్ గోపీ.

Warangal Collector Gopi : వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి కాసేపు స్టూడెంట్ గా మారారు. నర్సంపేట ఆశ్రమ పాఠశాల, జూనియర్ కాలేజీలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చుని టీచర్లు ఎలా బోధన చేస్తున్నారో పరిశీలించారు కలెక్టర్ గోపీ. అనంతరం వంటశాల, భోజన శాల వసతులను పరిశీలించారు.

ఆశ్రమ పాఠశాల, వసతి గృహాల్లో వార్డెన్స్ రెగులర్ గా అందుబాటులో ఉండాలని సూచించారు. వంటశాల, వంట సామాగ్రి అపరిశుభ్రంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు కలెక్టర్.

వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి సుమారు 40మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బల్లి పడిన ఆహారాన్ని పిల్లలకు వడ్డించారు హాస్టల్ సిబ్బంది. అన్నం తిన్న అనంతరం కొందరు పిల్లలు వాంతులు చేసుకున్నారు. తీవ్రమైన కడుపునొప్పి, భరించలేనంత బాధతో విలవిలలాడారు. వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు అంతా కోలుకుంటున్నారు.

తింటున్న అన్నంలో ఒక విద్యార్థికి బల్లి కనిపించింది. వెంటనే ఆ విద్యార్థి హాస్టల్ సిబ్బందికి చెప్పింది. అయితే, ‘బల్లి కనబడితే ఏమవుతుంది, ఏమీ కాదులే’ అంటూ హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదే భోజనాన్ని పిల్లలకు వడ్డించారు. దీంతో పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కలెక్టర్.. వార్డెన్ జ్యోతిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన తర్వాత ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో సదుపాయాలపై కలెక్టర్ గోపి ఫోకస్ పెట్టారు. స్వయంగా రంగంలోకి దిగి పరిశీలిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటాలు ఆడొద్దని సూచించారు.