లాయర్ వామన్‌రావు దంపతులను హత్య చేయించిందెవరు? అసలు సూత్రదారులెవరు..?

Lawyer Vamanrao couple murder case : మంథనిలో న్యాయవాది వామన్‌రావు దంపతులను చంపిందెవరు.. హత్య చేయించిందెవరు.. ఈ కేసులో అసలు సూత్రదారులెవరు.. పాత్రదారులెవరు.. ఆలయానికి సంబంధించిన వివాదమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నా.. అసలు హత్య కేసులో ఏం జరిగింది. వామన్‌రావు, నాగమణి హత్య కేసు మొత్తం పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్.. పుట్ట మధుకు ప్రధాన అనుచరుడు కావడంతో ఈ హత్య కేసులో పుట్టమధు ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయి.

నడిరోడ్డుపై వామన్‌రావు దంపతుల హత్య తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా, ప్రాజెక్టుల భూసేకరణకు వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వామన్‌రావు దంపతులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆస్తులపై కూడా వామన్‌రావు గతంలో కేసులు పెట్టారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని వామన్‌రావు వేసిన కేసు పుట్టమధు పదవికి గండం తెచ్చింది. పుట్ట మధుపై ఢిల్లీ స్థాయిలో కూడా ఫిర్యాదు చేశారు వామన్ రావు దంపతులు. దీంతో… వామన్‌రావు హత్యలో పుట్ట మధు పాత్ర ఉందని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే… కుంట శ్రీను తనపై దాడి చేశాడని వామన్‌రావు చివరగా చెప్పిన మాటలతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. అక్కడే కథ మారింది. కుంట శ్రీనుకు కారు, కత్తులను సరఫరా చేసింది బిట్టు శ్రీను అని తేలింది. మంథని జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడైన బిట్టు శ్రీను.. హంతకులకు అన్ని విధాలా సహకరించినట్టు నిర్ధారించారు. పుట్ట మధుకర్‌ మేనల్లుడు బిట్టు శ్రీను అరెస్ట్‌ కావడంతో ఒక్కసారిగా కేసు మలుపు తీసుకుంది. బిట్టు శ్రీను ఛైర్మన్‌గా ఉన్న పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్ట్‌ చుట్టూ వివాదాలు పెరిగాయి. 2018లో ట్రస్ట్‌పై దాఖలైన కేసును వామన్‌హరావు దంపతులు వాదిస్తున్నారు.

దీంతో లాయర్‌ దంపతుల ద్వారా ఎప్పటికైనా తమకు ప్రమాదమనే బిట్టు శ్రీను ఈ హత్యకు ప్లాన్‌ చేశాడా.. గుంజపడుగులో స్థల వివాదాన్ని అనువుగా మార్చుకున్నారా.. అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అయితే… హత్యలు జరిగేందుకు ముందు మూడు రోజుల వ్యవధిలో బిట్టూ శ్రీను, కుంట శ్రీనులు ఫోన్‌లో 25 సార్లు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. అప్పుడే హత్యలకు ప్లాన్ వేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు… బిట్టు శ్రీను తెరవెనుక ఉన్న ధైర్యం, భరోసా, సూత్రధారి ఎవరన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పుట్టమధు అండదండలతోనే బిట్టూ మంథనిలో ఎదిగాడు. పుట్టమధుకు ఎవరు ఎదురుతిరిగినా వాళ్లని కంట్రోల్‌ చేసే పని బిట్టూ చేసేవాడని ఆరోపనలు వస్తున్నాయి. దీంతో ఈ కేసులో మొదట కుంట శ్రీను, తర్వాత బిట్టు శ్రీను పేర్లు తెరపైకి వచ్చాయి.. నెక్ట్స్‌ ఎవరి పేరు వస్తుందో చూడాలి.