BRS Leaders: టిక్కెట్లు దక్కినా బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్.. ఎందుకంటే?

కొందరి అభ్యర్థిత్వాలను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం బీఆర్ఎస్ లో హాట్‌టాపిక్‌గా మారింది. 115 స్థానాల్లో కనీసం 10 మందిని మార్చి కొత్తవారికి బీ ఫాం ఇస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

BRS Party Leaders:తొలివిడత జాబితాలో టిక్కెట్లు దక్కించుకున్న బీఆర్ఎస్ (BRS Party) నేతల్లో సరికొత్త టెన్షన్ కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ (CM KCR) అనుగ్రహంతో తమ స్థానం పదిలం చేసుకున్నా.. కార్యకర్తలను, సొంత పార్టీలోని వైరి పక్షాన్ని ప్రసన్నం చేసుకోలేక చాలా మంది ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. తమకు వ్యతిరేకంగా క్యాడర్ చేస్తున్న ఆందోళనలతో ఎక్కడ తమ స్థానం గల్లంతు అవుతుందోనని హైరానా పడుతున్నారు. ఇలాంటి లిస్టులో సుమారు 10 మంది ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తుండటం హీట్ పుట్టిస్తోంది. సీఎం ఆశీస్సులతో పోటీకి రెడీ అవుతున్న ఎమ్మెల్యేలు.. క్యాడర్ నుంచి వ్యతిరేకత ఎదుర్కోడానికి కారణమేంటి? బీఆర్ఎస్ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతోంది.. తెరవెనుక ఏం జరుగుతోంది?

తెలంగాణలో హ్యట్రిక్ సాధించాలని తహతహలాడుతోంది అధికార బీఆర్ఎస్. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. అందరి కంటే ముందుగా 115 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను ప్రకటించారు సీఎం కేసీఆర్. కొందరు సిట్టింగ్లను మార్చాలన్న డిమాండ్లను పట్టించుకోకండా.. దాదాపు సిట్టింగుల్లో 90 శాతం మందికి టిక్కెట్లు ఇచ్చారు సీఎం.. కానీ, టిక్కెట్ల ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో నిరసనలు మాత్రం ఆగడం లేదు. ఇదే సమయంలో కొందరి అభ్యర్థిత్వాలను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం బీఆర్ఎస్ లో హాట్‌టాపిక్‌గా మారింది. 115 స్థానాల్లో కనీసం 10 మందిని మార్చి కొత్తవారికి బీ ఫాం ఇస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో చివరికి బి ఫాం గల్లంతయ్యేది ఎవరికన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

ఇలా అభ్యర్థిత్వాలు కోల్పోయేవారి జాబితాలో తొలి పేరు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుదేనని అంటున్నారు. తన కుమారుడికి టిక్కెట్ దక్కలేదని మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి టిక్కెట్ రద్దు చేయాలని పార్టీలో రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇక కోర్టు తీర్పుతో అనర్హత ఎదుర్కొంటున్న కొత్తగూడెం నేత వనమా వెంకటేశ్వరరావు కూడా మారే అవకాశం ఉందంటున్నారు. హైకోర్టు తీర్పును బలపరిస్తూ సుప్రీం తీర్పునిస్తే వనమా స్థానంలో కొత్త అభ్యర్థి వచ్చే చాన్స్ ఉంటుంది. ఇక వేములవాడలో చెన్నమనేని రమేశ్ (Chennamaneni Ramesh) పౌరసత్వ వివాదం కారణంగా టిక్కెట్ కోల్పోయారు. ఈ వ్యవహారంపైనా త్వరలో కోర్టు తీర్పు రానుందని అంటున్నారు. ఎన్నికల్లోగా రమేశ్‌కు అనుకూలంగా తీర్పు వస్తే.. ఆయనే వేములవాడ అభ్యర్థి అయ్యే అవకాశం కూడా లేకపోలేదనే టాక్ నడుస్తోంది. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపైనా కత్తి వేలాడుతోందని అంటున్నారు. చిన్నయ్యను శేజల్ డైరీ వివాదం వెంటాడుతోంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ (Banoth Shankar Naik) టికెట్‌పైనా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: మహేందర్‌రెడ్డిని అందలం ఎక్కించింది అందుకేనా.. ఎన్నికల వేళ కేసీఆర్ కీలక ఎత్తుగడ!

శంకర్ నాయక్‌కు టిక్కెట్ ఇవ్వొద్దంటూ ఆ నియోజకవర్గ నేతలు ఆరు నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. లిస్టు ప్రకటన తరువాత శంకర్ నాయక్‌పై అసమ్మతికి ఏమాత్రం తెరపడలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు సహాయ నిరాకరణ తప్పదని అక్కడి నేతలు బహిరంగంగా హెచ్చరిస్తుండటాన్ని సీరియస్‌గా పరిశీలిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి మధ్య వివాదం తీవ్రమవుతోంది. ఎమ్మెల్సీని ఒప్పించినా.. క్యాడర్ మాత్రం పట్టు వీడటంలేదని అంటున్నారు. పటాన్‌చెరులో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ నియోజకవర్గానికి చెందిన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నీలం మధు (Neelam Madhu Mudiraj) వర్గీయులు ఆందోళనలు చేస్తున్నారు. బీసీలను కూడగట్టి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడమే కాకుండా మహిపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్నే కొనసాగిస్తే.. తాము పార్టీకి మద్దతు ఇచ్చేది లేదన్న సంకేతాలు పంపుతున్నారు. అదే సమయంలో ముదిరాజ్ కులానికి చెందినవారికి ఒక్కరికి కూడా టిక్కెట్ ఇవ్వలేదంటూ ఆ వర్గం నుండి ఒత్తిడి పెరుగుతోంది.

Also Read: కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు.. నియోజకవర్గాల వారిగా పరిశీలన ప్రారంభం..

ఇక కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మలయ్యయాదవ్‌కు పార్టీ నేతల నుంచి పెద్దగా సహకారం అందడం లేదని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చందర్ రావును కలిసేందుకు బొల్లం స్వయంగా వెళ్లినా.. ఆయన ముఖం చాటేశారు. అలాగే వరంగల్‌లో నన్నపనేని నరేందర్ అభ్యర్థిత్వంపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇలా క్యాడర్ వ్యతిరేకిస్తున్న నేతల నియోజకవర్గాలపై గులాబీ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారు తర్వాత కూడా సర్వేల ద్వారా ఆయా నియోజకవర్గాల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి పరిస్థితుల్లో మార్పు లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్పదనే టాక్ నడుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు