MLC Tata Madhu Membership : తాతా మధు సభ్యత్వం రద్దవుతుందా? 2014 నుంచి ఇప్పటి వరకు ఎంత మంది సభ్యుల సభ్యత్వాలు రద్దయ్యాయి..
MLC Tata Madhu : తెలంగాణ శాసనసభ చరిత్రలో 2014 జూన్ నుండి ప్రస్తుత 2026 నాటి వరకు ఇద్దరు సభ్యుల (ఎమ్మెల్యేలు) సభ్యత్వాలను అసెంబ్లీ తీర్మానం ద్వారా రద్దు (బహిష్కరణ) చేశారు.
- Harish Thanniru
- Updated on- September 8, 2026 / 04:18 PM IST
MLC Thatha Madhu
MLC Tata MadhuMadhu : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ తరువాత అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్పీకర్ ప్రసాద్ కుమార్ తల్లిని కించపరుస్తూ తాతా మధు వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ సమయంలో ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఇదే సమయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ సైతం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. సీతక్క మాట్లాడుతూ.. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read – KTR : తాతా మధు అరెస్ట్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్.. మేము సిద్ధం.. మీరు సిద్ధమా? కాంగ్రెస్‌కు సవాల్..
తాజా పరిణామాలపై స్పీకర్ మాట్లాడుతూ.. తాతా మధు వ్యాఖ్యలపై శాసనసభ తీర్మానం చేసి మండలికి పంపుతామని అన్నారు. ఇదిలాఉంటే.. స్పీకర్ పై మధు అనుచిత వ్యాఖ్యల వీడియోను సీఎంవో విడుదల చేసింది. తాతా మధుపై చర్యలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి అంటే.. 2014 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది సభ్యుల సభ్యత్వం రద్దయింది అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది.
తెలంగాణ శాసనసభ చరిత్రలో 2014 జూన్ నుండి ప్రస్తుత 2026 నాటి వరకు ఇద్దరు సభ్యుల (ఎమ్మెల్యేలు) సభ్యత్వాలను అసెంబ్లీ తీర్మానం ద్వారా రద్దు (బహిష్కరణ) చేశారు. వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎస్ఏ సంపత్ కుమార్ లు ఉన్నారు. అయితే, కొద్ది రోజులకు న్యాయపోరాటం ద్వారా కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారి సభ్యత్వాలు మళ్లీ పునరుద్దరించబడ్డాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2018 మార్చి 12వ తేదీన బడ్జెట్ సమావేశాల మొదటి రోజున నాటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉమ్మడి సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నిరసన సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గవర్నర్ వైపు హెడ్ ఫోన్స్ విసిరారు. అవి కాస్తా అప్పటి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి బలంగా తాకడంతో ఆయన గాయపడ్డారు. ఈ వ్యవహారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు సంపత్ కుమార్ ప్రమేయం కూడా ఉందని ప్రభుత్వం భావించింది.
ఈ ఘటన తరువాత సభగౌరవానికి భంగం కలిగించారనే ఆరోపణలపై అప్పటి శాసనసభ వ్యవహారాల మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలపడంతో, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లు హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేయడంతో మళ్లీ వారి సభ్యత్వాలను పునరుద్దరించారు.
