×
Ad

Hyderabad : ఏసు ప్రభువు వచ్చి బతికిస్తాడని.. నాలుగు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. దుర్వాసన రావడంతో..

Hyderabad : హైదరాబాద్ నగరం పరిధిలోని కూకట్‌పల్లి ప్రాంతంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. చనిపోయి నాలుగు రోజులైనా మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రార్థనలు జరిపింది ఓ కుటుంబం.

Hyderabad

  • నాలుగు రోజులపాటు ఇంట్లోనే మృతదేహం
  • ఏసు ప్రభువు బతికిస్తాడని ప్రార్థనలు
  • హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఘటన

Hyderabad : హైదరాబాద్ నగరం పరిధిలోని కూకట్‌పల్లి ప్రాంతంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. చనిపోయి నాలుగు రోజులైనా మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రార్థనలు జరిపింది ఓ కుటుంబం. ఏసు ప్రభువు వస్తాడు.. చనిపోయిన వ్యక్తికి మళ్లీ ప్రాణం వస్తుందని నాలుగు రోజులుగా ఇంట్లోనే ప్రార్థనలు చేస్తుండిపోయారు. అయితే, ఆదివారం రాత్రి ప్లాట్‌లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read : Telangana Govt : రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. వారందరికీ భారీ శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4లక్షలు.. నేడోరేపో అధికారిక ఉత్తర్వులు..

ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన ఏసురత్నం భార్య శమంతకమణి, కొడుకు జయరాం, కూతుళ్లు సునీత, శైలజలతో కలిసి కూకట్‌పల్లి రామకృష్ణ కాలనీ శ్రీ సాయి భరద్వాజ అపార్టుమెంట్‌లోని మూడో అంతస్తులో నివాసం ఉంటున్నారు. పోలీసు శాఖలో ఎస్సైగా పనిచేసిన ఏసురత్నం గత కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఏసురత్నం భార్య శమంతకమణి, కొడుకు, కూతుళ్లు అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. నాలుగు పదులు దాటినా ముగ్గురు వివాహం చేసుకోలేదు. కాగా.. శుక్రవారం రోజు శైలజ అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారి ఇంటి వద్దకు చేరుకొని తలుపులు తీయాలని సూచించారు. తలుపులు తీసేందుకు కుటుంబ సభ్యులు ససేమీరా అనడంతో పోలీసులు బలవంతంగా తలుపులను తెరిచేందుకు ప్రయత్నించారు. తలుపులు బద్దలుకొట్టి మున్సిపాలిటీ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని తరలిస్తామని హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు తలుపులు తీశారు. ఆ తరువాత వారికి పోలీసులు నచ్చజెప్పి అంబులెన్సు ద్వారా శైలజ మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తరలించారు.

మృతిచెందిన తమ కూతురు శైలజను మళ్లీ బతికించేందుకు శమంతకమణి కొడుకు జయరాం, కూతురు సునీతతో కలిసి శుక్రవారం నుంచి ప్రార్థనలు చేస్తున్నట్లు సమాచారం. నాలుగు రోజులు ఏసు ప్రభువుకు ప్రార్థనలు చేస్తే ప్రాణం తిరిగి వస్తుందని వారు పోలీసులతో వాదించారు. ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే, అంతకుముందు ఆస్పత్రిలోసైతం వీరు వింతగా ప్రవర్తించారని తెలిసింది. రక్తహీనతతో బాధపడుతున్న శైలజకు రక్తం ఎక్కించాలని వైద్యులు చెబితే అందుకు నిరాకరించారు. పరిశుద్ధమైన రక్తమైతేనే ఎక్కించాలని పట్టుబట్టారు.