Telangana Govt : రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. వారందరికీ భారీ శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4లక్షలు.. నేడోరేపో అధికారిక ఉత్తర్వులు..
Telangana Govt : తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తొమ్మిది వేల మందికి లబ్ధి చేకూర్చేందుకు చర్యలు ప్రారంభించింది.
CM Revanth Reddy
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- 9వేల మందికి కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు
- గతంలో బేస్మెంట్ కట్టి వదిలేసిన వాళ్లకు అవకాశం
Telangana Govt : తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తొమ్మిది వేల మందికి లబ్ధి చేకూర్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం నేడోరేపో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతీఒక్కరికి సొంతింటి కలను సాకారం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.49లక్షల ఇళ్లకు మంజూరు లభించగా.. ఏప్రిల్ నాటికి మొదటి విడతగా లక్ష ఇళ్లను గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని జూన్ లేదా జూలై మాసం నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి రాష్ట్రంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు మొదలు పెట్టి బేస్మెంట్ కట్టి వదిలేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడోరేపో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇండ్లు మంజూరై బేస్మెంట్ కట్టగానే ప్రభుత్వం మారింది. ఆ తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి సాయం అందించలేదు. దీంతో ఆ ఇండ్లన్నీ బేస్మెంట్, వివిధ దశల్లో ఆగిపోయాయి. మరోవైపు.. గత ప్రభుత్వం ఎన్నికలు జరిగే ముందు గృహలక్ష్మి పథకంను ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ఇండ్లులేని లబ్ధిదారులకు రూ.3లక్షలు సాయం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే, బేస్మెంట్ మొదలు పెట్టే సమయానికి ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రభుత్వం సాయం అందించలేదు. దీంతో ఆ ఇండ్ల నిర్మాణాలు పూర్తికాలేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 9వేల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రతీ ఇంటికి రూ.5లక్షలను ప్రభుత్వం అందజేస్తోంది. మూడు నుంచి నాలుగు విడతల్లో ఈ సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే, గతంలో నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణానికి ఇందిరమ్మ ఇండ్ల పథకంను అమలు చేయడం ద్వారా.. వారికి బేస్మెంట్ సాయం రూ.లక్ష మినహాయించి మిగతా రూ.4లక్షలు సాయాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
