Sharmila
YS Sharmila : దివంగత వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల పార్టీ స్థాపనలో ఫుల్ బిజీ అయిపోయారు. నేతలు, వైఎస్ఆర్ అభిమానులతో వరుస భేటీలు జరుపుతూ వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. 2021, ఏప్రిల్ 09వ తేదీన ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన బహిరంగసభపై ప్రస్తుతం దృష్టి పెట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగసభ నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారు. ఇందుకోసం పలువురితో చర్చలు జరుపుతున్నారు. ఇదే సభలో పార్టీ పేరు, జెండాను అధికారికంగా ప్రకటించనున్నారు షర్మిల. దీంతో పార్టీ పేరు ఎముంటుందనే ఉత్కంఠ నెలకొంది.
అయితే..2021, మార్చి 25వ తేదీ గురువారం ముఖ్యనేతలతో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కానీ..తాను పెట్టబోయే పార్టీ పేరును అనుకోకుండా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మన ‘వైఎస్సార్ పార్టీ’యేనన్నారు షర్మిల. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తమ పార్టీకి వైఎస్సార్ అనే పేరు చాలన్నారు. తాము టీఆర్‌ఎస్ చెబితేనో, బీజేపీ అడిగితేనో రాజకీయాల్లోకి వచ్చినవాళ్లం కాదన్న షర్మిల…తెలంగాణలో రాజన్న పాలన అందివ్వడమే ధ్యేయమన్నారు.
వచ్చే నెల 9న ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించనున్న షర్మిల…అదే వేదికపైనుంచి నూతన పార్టీని ప్రకటించనున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణపై అన్ని జిల్లాల ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సంకల్ప సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను, కరపత్రాన్ని విడుదల చేశారు.