YS Sharmila : 3 పంటలు అబద్ధం, 24గంటల కరెంటు పచ్చి అబద్ధం- వైఎస్ షర్మిల సంచలనం

కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణికి నీళ్లిచ్చామని దొర చెప్తుంటే.. సాగుకు చుక్క నీరు లేక కాలువల పొంటే బోర్లు వేసుకొనే దుస్థితి రైతులది.(YS Sharmila)

YS Sharmila(Photo : Google)

YS Sharmila – CM KCR : కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి చెలరేగిపోతున్నారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. కొన్ని రోజులుగా ట్విట్టర్ లో కేసీఆర్ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న షర్మిల.. మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచిన రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అంశంపై సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు షర్మిల.

” కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణికి నీళ్లిచ్చామని దొర చెప్తుంటే.. సాగుకు చుక్క నీరు లేక కాలువల పొంటే బోర్లు వేసుకొనే దుస్థితి రైతులది. మండుటెండల్లో మత్తడి పారుతుందని కేసీఆర్ దొంగ పండుగలు చేస్తుంటే.. నారుమడికైనా కాసిన్ని నీళ్ళు లేవనేది రైతుల వాదన. 9 ఏండ్లలో ఉన్న బోర్లకు అదనంగా 15 లక్షల కొత్త బోర్లు పడ్డాయంటే.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ పని తీరు చెప్పనక్కర్లే.

Also Read..Jagga Reddy – Raghunandan: జగ్గారెడ్డి, రఘునందన్‌రావు మౌనం.. అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం

మసి పూసి మారేడు కాయ చేసినట్లు.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం “గోదారి నీళ్లను గోదారిలో ఎత్తిపోయడానికే”. రూ.38వేల కోట్లతో మహానేత కట్టాలనుకున్న తెలంగాణ జీవధార ప్రాణహిత-చేవెళ్లను రీ-డిజైన్ చేసి కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల ధారగా మార్చాడు. కోటి ఎకరాల పేరుతో కోటి భ్రమలే తప్ప లక్ష ఎకరాలకు దిక్కులేదు.

లక్ష 51 వేల కోట్లతో ప్రపంచం గర్వించే ప్రాజెక్ట్ కట్టి ఫామ్ హౌజ్ కి తప్పా తెలంగాణ మాగాణికి పారింది లేదు. బోరు ఉంటే సాగు.. లేకుంటే పడావులా ఉంది తెలంగాణ వ్యవసాయం. పనికి రాని ప్రాజెక్టులకు వేల కోట్లు కరెంట్ బిల్లులు కట్టే దొర గారు.. రైతులకు సరిపడా కరెంట్ మాత్రం ఇవ్వరు.

కాలువల్లో నీళ్ళు రావు. బోర్లు నడవవు. పంటల్ని ఎండబెట్టి.. రైతుల్ని రోడ్లపైకి ఈడ్చి పట్టుమని 8 గంటలు ఇయ్యలేనోళ్ళు.. 24 గంటలు ఇస్తున్నం అంటుంటే..దెయ్యాలు వేదాలు పలికినట్లుంది. 24 గంటల ఉచిత విద్యుత్ అబద్ధం అనడానికి ట్రాన్స్ కో, జెన్కో CMD చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
“మూడు పంటలు అబద్ధం-24గంటల కరెంటు పచ్చి అబద్ధం” అని ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల.

Also Read..KCR Strategy: ఆశావహులు, అసమ్మతి నేతలు జారిపోకుండా కేసీఆర్ కొత్త వ్యూహం.. జంప్ జిలానీలకు చెక్!