YS Sharmila: షర్మిల ‘పోడు యాత్ర’.. వరస పర్యటనలతో జోరు!

వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ రాజకీయాలలో జోరు పెంచినట్లు కనిపిస్తుంది. వరస పర్యటనతో స్పీడ్ పెంచిన షర్మిల ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. మంగళవారం నాడు నిరుద్యోగులకు బాసటగా నిరాహార దీక్షకు దిగిన షర్మిల.. నేడు పోడు భూముల కోసం యాత్రకి సిద్ధమయ్యారు.

Ys Sharmila

YS Sharmila: వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ రాజకీయాలలో జోరు పెంచినట్లు కనిపిస్తుంది. వరస పర్యటనలతో స్పీడ్ పెంచిన షర్మిల ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. మంగళవారం నాడు నిరుద్యోగులకు బాసటగా నిరాహార దీక్షకు దిగిన షర్మిల.. నేడు పోడు భూముల కోసం యాత్రకి సిద్ధమయ్యారు. బుధవారం ములుగు జిల్లాలో ఈ పర్యటన మొదలయ్యే అవకాశాలున్నాయి.

షర్మిల ముందుగా జిల్లా కేంద్రానికి చేరుకొని అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి అక్కడ నుంచి గోవిందరావుపేట మండలం పస్రా పసరాకు చేరకొని కొమురంభీం విగ్రహానికి పూలమాల వేయనున్నారు. అనంతరం తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో పోడు యాత్ర కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు పోడు భూములను పరిశీలించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పోడు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ మాటలు ఆచరణకు నోచుకోలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు గిరిజనులు, అటవీ అధికారులకు మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల స్వాధీనానికి అధికారులు యత్నించడం… ప్రజలు తిరగబడటం జరుగుతోంది.

ఇదే పోడు అంశానికి సంబంధించి మంగళవారం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర స్థాయిలో స్పందించారు. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డిపై కన్నెర్ర చేశారు. మహిళా రైతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తరిమికొడతారు జాగ్రత్త… రైతులకు అన్యాయమా.. కత్తులు, గొడ్డళ్లతో దాడులు చేస్తారు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఇక్కడ సీతక్క కూడా పోడు భరోసా యాత్ర నిర్వహించగా.. ఇప్పుడు షర్మిల ఇదే బాటలో పోడు యాత్రకు సిద్ధమవుతున్నారు.