ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ.. ఆ పదిమందిలో నలుగురిపై వేటు పడటం ఖాయమా? రిజైన్ చేస్తారా?

స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి అక్టోబర్ 31 వరకు సమయం ఉంది కాబట్టి..స్పీకర్ వారిపై వేటు వేసే కంటే ముందే రిజైన్ చేయించడం ద్వారా కొంత సానుకూలత వ్యక్తమవుతుందని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ.. ఆ పదిమందిలో నలుగురిపై వేటు పడటం ఖాయమా? రిజైన్ చేస్తారా?

Telangana Assembly Speaker gaddam prasad

Updated On : September 8, 2025 / 9:43 PM IST

Telangana: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఇష్యూ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి..ఆ తర్వాత అధికార కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు కోసం బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం..10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.

అందులో ఒకరిద్దరు స్పీకర్‌కు సమాధానం ఇవ్వగా మరి కొందరు కొంత గడువు అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంతలో కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. బీఆర్ఎస్‌లోనే ఉన్నానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అంటుంటే..నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ వెంట నడుస్తున్నట్లు చెప్పుకొస్తున్నారట భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.

ఇక కడియం శ్రీహరి అయితే ఏ పార్టీలో ఉన్నా అనుకుంటే ఆ పార్టీలోనే ఉన్నట్లు అంటూ సమాధానం దాటవేయడం చర్చకు దారి తీసింది. ఇక దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి అయితే అనర్హత వేటుపై పెద్దగా రియాక్ట్ కావడం లేదు. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు.

నలుగురిపై మాత్రం కచ్చితంగా వేటు?

పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిపై మాత్రం కచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్గుర్తు మీద గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో కొందరు పార్టీ మారినట్టు భౌతిక, సాంకేతిక ఆధారాలు ఉండటంతో వారిపై వేటు తప్పదని అంటున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి..తన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్‌గా పోటీ చేసినప్పుడు ఆ నామినేషన్ పత్రం మీద సంతకం చేశారని అంటున్నారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని అలిగేషన్స్ ఉన్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. దీంతో వీరిపై స్పీకర్ వేటు వేయక తప్పదనే వాదన వినిపిస్తోంది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుని.. అంతా భావిస్తున్నట్లు ఆ నలుగురిపై అనర్హత వేటు వేస్తే బిహార్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఈ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందే ఆ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి అక్టోబర్ 31 వరకు సమయం ఉంది కాబట్టి..స్పీకర్ వారిపై వేటు వేసే కంటే ముందే రిజైన్ చేయించడం ద్వారా కొంత సానుకూలత వ్యక్తమవుతుందని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ముందుగా ఎమ్మెల్యేలతో రిజైన్ చేయిస్తే కొంత సింపతీ వస్తుందని అంచనా వేస్తున్నారట.

అయితే ఆ నలుగురితో రాజీనామా చేయించే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలనుకుంటున్నారట. ఇప్పుడు వారితో రిజైన్ చేయిస్తే జూబ్లీహిల్స్ పాటు ఆ నాలుగు సీట్లకు బైపోల్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ బీహార్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక..అక్టోబర్ చివరి వారంలో ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారట.

అలా అయితే జూబ్లీహిల్స్ బైపోల్ జరిగిన తర్వాత..మరో ఆరు నెలలకు ఉప ఎన్నికలు వస్తాయని అంచనా వేసి..అందుకు తగ్గట్లుగా పొలిటికల్‌ డెసిషన్స్‌ తీసుకోవాలనేది రేవంత్ వ్యూహం అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్స్ ఎంత వరకు వర్కౌట్ అవుతాయో..ఫిరాయింపు ఎమ్మెల్యేలో రాజీనామా చేయిస్తారో లేదో చూడాలి మరి.