ఏసీబీ చరిత్రలోనే అధిక మొత్తంలో లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకున్న వైనం తెలంగాణలో వెలుగు చూసింది. అవినీతి నిరోధ శాఖ అధికారులు వలపన్ని భారీ తిమింగలాన్నే పట్టారు. ఏకంగాకోటి 25లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న కీసర తహసీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని ఓ వ్యవసాయభూమిని రియల్‌ఎస్టేట్ సంస్థకు అనుకూలంగా మార్చి కాగితాలు తయారు చేసేందుకులంచావతారం తహసీల్దార్ నాగరాజు భారీగా లంచం డిమాండ్ చేశాడు. ఈవిషయమై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారంరాత్రి తహసీల్దార్ ఇంటివద్ద మాటు వేసి లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయర సర్వే నెంబర్లు 604 నుంచి 614 వరకు ఉన్న 44 ఎకరాలకు పైగా వ్యవసాయభూమి ఒక కుటుంబానికి పూర్వీకుల నుంచి సంక్రమించింది. 1996 లో 16 ఎకరాల భూమికి సంబంధించి హక్కులను ఆ కుటుంబానికి చెందినవ్యక్తులకు కల్పిస్తూ అప్పటి ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచీ మిగిలిన 28 ఎకరాలకు సంబంధించి భూవివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ అంశంకోర్టులో ఉంది.
హైదరాబాద్ చుట్టు పక్కల భూముల ధరలు పెరగటంతో.. ఈవ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు ఓ రాజకీయ పార్టీకి చెందిన సీనియర్ నేత అనుచరుడు కీసర కు చెందిన అంజిరెడ్డి, ఉప్పల్ కు చెందిన బ్రోకర్ శ్రీనాధ్ చేపట్టారు. ఈ భూమిని రియల్‌ఎస్టేట్ సంస్థకు అనుకూలంగా మార్చి కాగితాలు తయారుచేసేందుకు రాంపల్లి వీఆర్‌ఏ బొంగు సాయిరాజ్ సహకారంతో వీరు తహసిల్దార్ తో బేరం మాట్లాడుకున్నారు.
అందులో భాగంగా లంచం ముట్ట చెప్పేందుకు శుక్రవారం రాత్రి ఏఎస్ రావు నగర్ లో ఉన్న తహసీల్దార్ ఇంటికి డబ్బులు ఇచ్చేందుకు ముగ్గురు వచ్చారు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ నాగరాజు ఇంట్లో సోదాలకు వెళ్ళిన ఏసీబీ అధికారులు గుట్టలుగా ఉన్న నగదు చూసి ఆశ్చర్య పోయారు.
అన్నీ రూ.500, రూ.100 నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ మొత్తాన్ని లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్లు తెప్పించి గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. పట్టుబడిన తహసీల్దార్ నాగరాజు ఇటీవలే ఓ ఏసీబీ కేసు నుంచి బయటపడినట్టు సమాచారం. శనివారం కూడా నాగరాజు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలునిర్వహించే అవకాశం ఉంది. ఈ సోదాల్లో ఇంకెన్ని అవినీతి ఆస్తులు బయటపడతాయో వేచి చూడాలి.