Cm Revanth Reddy: ఈ ప్రభుత్వం కార్మికులది.. సమస్యలు పరిష్కరిస్తా.. సమ్మె వల్ల నష్టమే- ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో సీఎం రేవంత్

చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలన్నారు. పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దన్నారు.

Cm Revanth Reddy: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం కార్మికులదని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏం కావాలో చర్చించుకుని చెప్పాలన్నారు.

సినిమా కార్మికులను విస్మరించొద్దని నిర్మాతలకు చెప్పానన్నారు. సినిమా కార్మికుల్లో నైపుణ్యాల పెంపునకు సహకరించాల్సిందిగా నిర్మాతలను కోరానన్నారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తామన్నారు. సినిమా కార్మికులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. అన్ని భాషల సినిమాల షూటింగ్ లు తెలంగాణలో జరిగేలా సహకరించాలని సీఎం రేవంత్ అన్నారు.

చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలన్నారు. పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దన్నారు. సమ్మెకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుందన్నారు. సమస్యను సమస్యగానే చూస్తాను, వ్యక్తిగత పరిచయాలను చూసుకోను అని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు. సినిమా కార్మికుల తరపున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్నారు. ఈ ప్రభుత్వం మీది.. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు.

నేను కార్మికుల వైపు ఉంటాను.. అదే సమయంలో నాకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం అని తేల్చి చెప్పారాయన. సమ్మె జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమన్నారు. సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే ప్రయత్నం చేస్తామన్నారు. సినీ కళాకారులకు గద్దర్ అవార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. పదేళ్లు సినిమా వాళ్లకు అవార్డులు కూడా ఇవ్వలేదని, ఇన్నేళ్లలో సినిమా కార్మికులను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి కూడా లేరని సంఘాల నాయకులు అన్నారు.