మీరు సివిల్ సర్వీసెస్ (UPSC) పరీక్షలో విజయం సాధించి IAS, IPS అధికారి కావాలని కలలు కంటున్నారా? అయితే, మీలాగే కలలుగని వాటిని సాకారం చేసుకున్న ఢిల్లీ విశ్వవిద్యాలయ (DU) యూజీ స్టూడెంట్ల గురించి తెలుసుకోవాల్సిందే.
IAS, IPS అధికారి కావడానికి ఢిల్లీ విశ్వవిద్యాలయం (DU)లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యనభ్యసించడానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? ఇది కేవలం ఒక విద్యా సంస్థ మాత్రమే కాదు, UPSC ఆశావహుల బెస్ట్ ఆప్షన్ అవుతోంది.
ఢిల్లీ యూనివర్సిటీ ఓ “IAS ఫ్యాక్టరీ”
గత కొన్నేళ్లుగా UPSC టాపర్‌ల జాబితాను చూస్తే, టీనా డాబీ (AIR 1, 2015), శ్రుతి శర్మ (AIR 1, 2021), స్మృతి మిశ్రా (AIR 4, 2022) వంటి ఎందరో ప్రముఖులు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులే. కేవలం కొందరు మాత్రమే కాదు, గడిచిన కొన్ని దశాబ్దాలుగా వేలాది మంది DU విద్యార్థులు సివిల్స్‌లో విజయం సాధించారు. దీనికి కారణం కేవలం అదృష్టం కాదు, DUలో ఉన్న ప్రత్యేకమైన వాతావరణం.
ఆ ప్రత్యేకతలు ఏమిటి?
ఇక్కడే పునాది పడుతుంది..
UPSC సిలబస్‌లో అధిక భాగం హ్యుమానిటీస్ సబ్జెక్టుల నుంచే వస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రముఖ కళాశాలలు ఈ సబ్జెక్టులలో అత్యుత్తమ విద్యను అందిస్తాయి.
పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, జాగ్రఫీ వంటి సబ్జెక్టులపై ఇక్కడ లభించే లోతైన అవగాహన, UPSC మెయిన్స్ పరీక్షలో ఆప్షనల్ సబ్జెక్టులకు, జనరల్ స్టడీస్ పేపర్లకు బలమైన పునాది వేస్తుంది.
పోటీ వాతావరణం, ఎకోసిస్టమ్
DUలో చదవడం అంటే కేవలం క్లాసులకు హాజరై వెళ్లిపోవడం కాదు. ఇక్కడ మీకు ఒక ప్రత్యేకమైన “ఎకోసిస్టమ్” లభిస్తుంది. సీనియర్లు, తోటి విద్యార్థుల నుంచి స్ఫూర్తి పొందుతారు. మీ చుట్టూ ఉన్న చాలా మంది విద్యార్థులు కూడా UPSCకి సిద్ధమవుతూ ఉంటారు. ఈ పోటీ వాతావరణం మిమ్మల్ని నిరంతరం ప్రేరేపిస్తుంది.
విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి చర్చించుకోవడం, నోట్స్ పంచుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం సర్వసాధారణం. ఢిల్లీలోని ప్రముఖ UPSC కోచింగ్ సెంటర్‌లు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.
సమగ్ర వ్యక్తిత్వ వికాసం
UPSC కేవలం రాత పరీక్ష మాత్రమే కాదు, పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కూడా ఇందులో కీలకం. DUలోని విద్యార్థి జీవితం మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది.
డిబేట్ క్లబ్‌లు, సెమినార్లు, కల్చరల్ ఫెస్టివల్స్ వంటి వాటిలో పాల్గొనడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో సంభాషించొచ్చు.
ప్రస్తుతం DUలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకవేళ మీ లక్ష్యం UPSC అయితే, కాలేజీ బ్రాండ్ పేరుతో పాటు, మీకు ఆసక్తి ఉన్న, UPSCకి ఉపయోగపడే కోర్సును ఎంచుకోవడం చాలా ముఖ్యం. పొలిటికల్ సైన్స్ (ఆనర్స్), హిస్టరీ (ఆనర్స్), లేదా ఎకనామిక్స్ (ఆనర్స్) వంటి కోర్సులు మీకు సరైన పునాదిని వేస్తాయి.
ఢిల్లీ విశ్వవిద్యాలయం కేవలం ఒక డిగ్రీని మాత్రమే ఇవ్వదు. UPSC లాంటి లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన జ్ఞానం, స్ఫూర్తి, సరైన వాతావరణం, మార్గదర్శకత్వం అందిస్తుంది. అందుకే, ఇది ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న సివిల్స్ ఆశావహులకు మొదటి ఆప్షన్‌గా నిలుస్తోంది.