×
Ad

Narsapur Congress: నర్సాపూర్‌ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట.. గ్రూపు పాలిటిక్స్‌కు రీజనేంటి?

గ్రూపు రాజకీయాలతో పార్టీని మరింత దిగజార్చుతున్నారని ఇలాగే కొనసాగితే..మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో ఫలితాలు ఆశించిన స్థాయిల్లో రాకపోవచ్చని కార్యకర్తలు గుసగుసలు పెట్టుకుంటున్నారట.

Narsapur Congress Representative Image (Image Credit To Original Source)

  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్ నేతల రూటే సెపరేటు
  • నర్సాపూర్‌ కాంగ్రెస్‌లో ఎవరికి వారే అన్నట్లుగా ముగ్గురు నేతలు
  • పార్టీ బలహీనపడుతుందని ద్వితీయశ్రేణి నేతల ఆగ్రహం

 

Narsapur Congress: ఒకరు అవునంటే మరొకరు కాదంటారు. టికెట్‌ రాలేదనే బాధ ఒకరిది. గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదన మరొకరిది. కలుపుకుని వెళ్దామన్నా ఆ ఇద్దరు సహకరించడం లేదన్న ఆందోళన ఇంకో నేతది. ఇలా ఎవరి దారి వారిదే.. ఎవరి గోల వారిదే అన్నట్లుగా ఉందట ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ లీడర్ల తీరు. గ్రూపు తగాదాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయట. నాయకుల మధ్య ఏ మాత్రం సఖ్యత లేకపోగా..చేజేతులా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని క్యాడర్ రగిలిపోతోందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అక్కడ గ్రూపు పాలిటిక్స్‌కు రీజనేంటి?

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం, ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. ఈ సెగ్మెంట్‌కు 15సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుసార్లు హస్తం పార్టీనే గెలిచింది. ఐదుసార్లు సీపీఐ విజయం సాధించింది. 2014 నుంచి సీన్ మారిపోయింది. అప్పటివరకు ఒకసారి కాంగ్రెస్ మరోసారి సీపీఐ గెల్చుకుంటూ వచ్చినా 2014 నుంచి బీఆర్ఎస్‌దే హవా. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చిలుముల మధన్ రెడ్డి గెలుస్తూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన సునీత లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ సీటు ఇచ్చింది. దీంతో మధన్‌రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు.

పార్టీ వీడినా మధన్‌రెడ్డిని కాదని ఆవుల రాజిరెడ్డిని అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది కాంగ్రెస్. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి చేతిలో 8,555 ఓట్ల తేడాతో రాజిరెడ్డి ఓడిపోయారు. తనకు సీటు కేటాయిస్తే తప్పక గెల్చేవాడినని మధన్ రెడ్డి ఫలితాల తర్వాత నిర్వేదం వ్యక్తం చేశారు. ఇక అప్పటి నుంచి మధన్ రెడ్డి తనపని తను చేసుకుంటూ పోతున్నారు. ఇక నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్‌ ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మధన్ రెడ్డి ఎవరికి వారు మూడు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు.

పార్టీ క్యాడర్‌కు తలనొప్పిగా ఆ ముగ్గురు..

ముగ్గురు నేతలు..మూడు గ్రూప్‌లు..పార్టీ క్యాడర్‌కు తలనొప్పిగా మారాయట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే మధన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్‌ ఆవుల రాజిరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్‌ ఆంజనేయులు గౌడ్ మధ్య ఏ మాత్రం సఖ్యత లేదట. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపులకు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నా..రాజిరెడ్డి, మధన్‌రెడ్డి కలిసి రావడం లేదట.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 220 గ్రామ పంచాయతీల్లో 118 స్థానాలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆశించిన స్థాయిలో ఇక్కడ ఫలితాలు రాకపోవడంతో అధిష్టానం కూడా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చిన ఫలితాలు కూడా పార్టీ క్యాడర్ పనితీరు వల్లే కానీ..నాయకుల కృషి ఏమాత్రం లేదని పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లిందట. గ్రూపు రాజకీయాలతో పార్టీని మరింత దిగజార్చుతున్నారని ఇలాగే కొనసాగితే..మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో ఫలితాలు ఆశించిన స్థాయిల్లో రాకపోవచ్చని కార్యకర్తలు గుసగుసలు పెట్టుకుంటున్నారట.

పార్టీని ఎదగకుండా చేస్తున్నారని క్యాడర్‌ ఆవేదన..

అటు సీనియర్ నాయకుడు మధన్ రెడ్డిని, ఇటు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌ను కాదని ఆవుల రాజిరెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోవడం వల్లే నియోజకవర్గంలో పార్టీ బలహీనపడుతుందని ద్వితీయశ్రేణి నేతలు ఆగ్రహంతో ఉన్నారట. మాజీమంత్రి, ప్రస్తుత నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సొంత గ్రామం గోమారంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి 600 ఓట్ల మెజార్టీతో గెలవడం, ఆవుల రాజిరెడ్డి సొంతూరు మాసాయిపేటలో, ఆంజనేయులు గౌడ్ సొంత గ్రామం రెడ్డి పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు వెనుక ఈ ముగ్గురు నేతల కృషి ఏమాత్రం లేదని..స్థానిక నేతలే అన్నింటికి ఓర్చి నిలబడ్డారన్న టాక్ చర్చనీయాంశం అవుతోంది. నియోజకవర్గంలో మునుపటిలా కాంగ్రెస్‌కు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉన్నా నేతలు గ్రూపులుగా విడిపోయి..పార్టీని ఎదగకుండా చేస్తున్నారని క్యాడర్‌ ఆవేదన వ్యక్తం చేస్తోందట. పార్టీ అధిష్టానం కలుగజేసుకుని పరిస్థితిని చక్కబెడుతుందో లేదో వేచి చూడాలి.