BSNL: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌.. బీఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ లాభాల బాటలోకి ఎలా వచ్చిందో తెలుసా? మీరూ వాడుతున్నారా?

దుమ్మురేపుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

మార్కెట్లో ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ దుమ్మురేపుతోంది. తన సత్తా ఏంటో మళ్లీ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌ మళ్లీ ఇప్పుడు లాభాల బాటలోకి ప్రవేశించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఏకంగా 262 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. కీలక సేవలలో ఆదాయ వృద్ధి సాధించింది. 2007 అనంతరం మళ్లీ ఇప్పుడు బీఎస్ఎన్‌ఎల్‌కు లాభాలు రావడం గమనార్హం.

మొబిలిటీ సేవల్లో 15 శాతం వృద్ధి కనపడింది. ఫైబర్-టు-ది-హోమ్ ఆదాయం 18 శాతం పెరిగింది. లీజ్డ్ లైన్ సేవలు 14 శాతం వృద్ధిని కనబర్చాయి. అదనంగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్ బేస్ జూన్‌లో 8.4 కోట్ల నుంచి డిసెంబర్‌లో 9 కోట్లకు పెరిగింది. ఇది దాని సర్వీసులు పెరుగుతున్న తీరును సూచిస్తోంది.

Also Read: విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌లో కొత్త కోర్సు.. పూర్తి వివరాలివే..

ఈ విషయాన్ని తెలుపుతూ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. తమ నెట్‌వర్క్ విస్తరణ వేగంగా జరుగుతుండడంతో పాటు కొత్త యూజర్లు చేరడం, సంస్థ ఖర్చులు తగ్గించుకోవడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఈ లాభాలు సాధ్యమయ్యాయని సంస్థ సీఎండీ రాబర్ట్ జె.రవి చెప్పారు.

ఈ ఆర్థిక ఏడాది ముగిసేనాటికి 20 శాతం ఆదాయం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ మళ్లీ లాభాల బాటలోకి వస్తుందనేందుకు ఇది నిదర్శనమన్నారు. తమ సంస్థకు భవిష్యత్తుపై భరోసా పెరిగిందని తెలిపారు.

తమ సంస్థలో ఖర్చులు తగ్గించుకోవడంతో రూ.1800 కోట్ల నష్టాలు తగ్గినట్లు చెప్పారు. మొబైల్ సర్వీసుల రెవెన్యూ 15 శాతం పెరగగా, ఫైబర్ టూ హోమ్ సర్వీసుల ఆదాయం 18 శాతం పెరిగిందని తెలిపారు. తాము నేషనల్ వైఫై రోమింగ్‌తో పాటు మొబైల్ యూజర్ల కోసం పలు సర్వీసులను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

5జీతో పాటు అత్యాధునిక డిజిటల్ సర్వీసులను అందిపుచ్చుకునేలా తమ సంస్థ ముందుకు వెళ్తుందని అన్నారు. కాగా, 4జీ సేవల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ 1,00,000 టవర్లను ఏర్పాటు చేస్తోంది. వీటిలో 75,000 ఇప్పటికే ఏర్పాటయ్యాయి. వాటిలో 60,000 పనిచేస్తున్నాయి.