టీటీడీపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చారో అది వక్ఫ్ బోర్డును కాపాడేందుకు తీసుకురాలేదు.

Asaduddin Owaisi On TTD (Photo Credit : Google)

Asaduddin Owaisi : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ), వక్ఫ్ బోర్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను సభ్యులుగా చేర్చాలని మోదీ సర్కార్ బిల్లు తెచ్చిందని.. టీటీడీలో మాత్రం అందరూ హిందువులే ఉండాలని అంటున్నారని ఒవైసీ అన్నారు. హిందువులకు టీటీడీ పవిత్రమైనప్పుడు, ముస్లింలకు వక్ఫ్ బోర్డు కూడా అంతే పవిత్రమైందన్నారు. అలాంటి చోట ఇతరులను ఎలా అనుమతిస్తారని ఒవైసీ ప్రశ్నించారు.

”ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చారో అది వక్ఫ్ బోర్డును కాపాడేందుకు తీసుకురాలేదు. వక్ఫ్ ని కాపాడేందుకు కాదు వక్ఫ్ ని లూటీ చేసేందుకు తీసుకొచ్చారు. ఆ భూమికి యజమాని అల్లా… అయితే, ఆ భూమికి యజమాని నేను, కలెక్టర్ అని ప్రధాని మోదీ అంటున్నారు. అందువల్లే నేను చెప్పడం ఏంటంటే.. టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలని ఛైర్మన్ ఏదైతే చెప్పారో అది చాలా కరెక్ట్. అక్కడ మంచిది అంటున్నారు మీరు మా దగ్గర ఎందుకు కాదంటున్నారు” అని ఒవైసీ ప్రశ్నించారు.

టీటీడీ బోర్డు ఛైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఒవైసీ స్పందించారు. టీటీడీలో పని చేసే వారంతా కేవలం హిందువులే అయి ఉండాలని బీఆర్ నాయుడు అన్నారు. దీనిపై స్పందించిన ఒవైసీ.. ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. వక్ఫ్ బోర్డులు, కౌన్సిల్స్ లో ముస్లిమేతరులను తీసుకొచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఒవైసీ మండిపడ్డారు. దానికి, బీఆర్ నాయుడు చేసిన హిందువుల వ్యాఖ్యలకు ముడి పెట్టారాయన. టీటీడీలో కేవలం హిందువులు మాత్రమే పని చేయాలని బీఆర్ నాయుడు అంటున్నారు, కానీ, మోదీ సర్కార్ మాత్రం వక్ఫ్ బోర్డులు, కౌన్సిల్స్ లో కచ్చితంగా నాన్ ముస్లింలు ఉండాల్సిందేనని చెబుతోందన్నారు. చాలా వరకు హిందూ ఎండో మెంట్ చట్టాలు.. మెంబర్లుగా హిందువులే ఉండాలని చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

‘తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ అన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డులు, వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులు ఉండడాన్ని తప్పనిసరి చేయాలనుకుంటోంది. చాలా హిందూ ఎండోమెంట్ చట్టాలు హిందువులు మాత్రమే దాని సభ్యులుగా ఉండాలని నొక్కి చెబుతున్నాయి’ అని ట్వీట్ చేశారు ఒవైసీ.

Also Read : తిరుమలలో నేను చాలా పనులు చేయాలి- టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు