Gold Reserves
Gold Reserves: ఒడిశాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఖనిజ పరిశోధనల్లో బంగారు గనులు గుర్తించింది. అధికారులు మైనింగ్, వేలంపై దృష్టి సారించారు.
డెవొగఢ్ (అదస-రాంపల్లి), సుందర్‌ఘఢ్, నబరంగ్‌పూర్, కేయోన్జర్, అంగుల్, కోరాపుట్ జిల్లాల్లో బంగారు నిల్వలు ఉన్నట్లు జీఎస్‌ఐ తేల్చింది. మయూర్భంజ్, మల్కాన్గిరి, సంబల్పూర్, బౌధ్ జిల్లాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం ఇంకా అధికారిక గణాంకాలు ప్రకటించలేదు. భూశాస్త్ర సూచనల ఆధారంగా నిపుణులు నిల్వలు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇది పెద్ద మొత్తమే అయినా, భారతదేశం దిగుమతి చేసుకునే బంగారం పరిమాణంతో పోలిస్తే తక్కువే.
భారతదేశం గత సంవత్సరం సుమారు 700–800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. దేశీయ ఉత్పత్తి 2020లో కేవలం 1.6 టన్నులే.
ఒడిశా ప్రభుత్వం, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ (OMC), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలిసి బంగారం గనుల గుర్తింపును వాణిజ్యరంగంలోకి తేవడానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి.
డెవొగఢ్‌లో తొలి మైనింగ్ బ్లాక్ వేలం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ఖనిజ రంగానికి కీలక ఘట్టం.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటికే జీ3 (ప్రాథమిక రికానైసెన్స్) స్థాయి నుంచి జీ2 స్థాయికి (శాంప్లింగ్, డ్రిల్లింగ్) పరిశోధనలను పెంచుతోంది. అదస-రాంపల్లి, గోపూర్-గజిపూర్ ప్రాంతాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
కొత్తగా కనుగొన్న బంగారు నిల్వల తవ్వకాల వల్ల ప్రాంతీయాభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు, ఉద్యోగాలు, రవాణా, స్థానిక సేవలు పెరుగుతాయి. భారత ఖనిజ రంగంలో ఒడిశా ఇప్పటికే 96% క్రోమైట్, 52% బాక్సైట్, 33% ఇనుప ఖనిజ నిల్వలను కలిగి ఉంది.
వాణిజ్యపరమైన సాధ్యాసాధ్యాలను అంచనా వేసే సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఎంఎండీఆర్ చట్టం ప్రకారం మైనింగ్ బ్లాక్ వేలాన్ని నిర్వహిస్తారు. పర్యావరణ, సామాజిక ప్రభావాలపై అంచనాలు వేస్తారు. మైనింగ్ ఆపరేషన్ల కోసం రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలను అభివృద్ధి చేస్తారు.