Rafale (Image Credit To Original Source)
Rafale Deal: ఫ్రాన్స్ నుంచి భారత్ మరో 114 రాఫెల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనకు డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ బోర్డ్ ఆమోదం తెలపడంతో పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. చైనాతో పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) ఆసిమ్ మునీర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
భారత్ రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ గతంలో చైనా తయారీ జే 10సీఈ యుద్ధ విమానాలను కొనుక్కుంది. ఇప్పుడు కూడా ఆసిమ్ మునీర్ చైనా నుంచి కొనుగోళ్ల ద్వారా పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నారు.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. చైనా నుంచి 60 నుంచి 70 మల్టీరోల్ యుద్ధ విమానాలను కొనాలని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ ప్రణాళిక రూపొందిస్తోంది. అదనంగా 40 జే 35 స్టెల్త్ యుద్ధ విమానాలకు కూడా ఆర్డర్లు ఇవ్వాలని కూడా యోచిస్తోంది. భారత్ రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్యను పెంచుకుంటున్న నేపథ్యంలో చైనా నుంచి ఆయా యుద్ధ విమానాలను కొనుగోలుచేయడం పాక్ వ్యూహంలో కీలకంగా విశ్లేషకులు భావిస్తున్నారు. జే-35 స్టెల్త్ యుద్ధ విమానాలను రాడార్‌లు అంతగా పసిగట్టలేవు. ఇది ఐదో తరం యుద్ధ విమానం.
పాక్ ఎయిర్ ఫోర్స్ వర్గాల ప్రకారం.. భారత వైమానిక దళంలో భవిష్యత్తులో 114 రాఫెల్ యుద్ధ విమానాలు చేరనుండడంతో గగనతల ఆధిపత్యం నిలుపుకోవాలంటే పాకిస్థాన్ అత్యధిక సామర్థ్యం ఉండే యుద్ధ విమానాల సంఖ్యను పెంచుకోవాల్సి వస్తుంది. ఈ లక్ష్యంతో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ దాదాపు 60-70 జే 10సీఈ విమానాలను అదనంగా ఆర్డర్ చేయనుంది.
Also Read: ట్రంప్‌కి షాకిచ్చిన ఇండియా.. దెబ్బకు దెబ్బ.. సైలెంట్‌గా టారిఫ్ వేసేసింది..
అలాగే, జే 35 స్టెల్త్ విమానాలను కొంటే పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వద్ద అందుబాటులో ఉన్న అత్యాధునిక యుద్ధ విమానంగా ఇది నిలుస్తుంది. భారత్ అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రోగ్రాన్ని దృష్టిలో పెట్టుకుని జే 35 స్టెల్త్ విమానాలను కొనుగోలు చేయాలని పాక్ భావిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ గగనతల ఆపరేషన్లకు ఎఫ్ 16 విమానాలను ప్రధానంగా వినియోగిస్తోంది.
జే 10సీఈ, జే 35 యుద్ధ విమానాల కొనుగోలుపై పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ దీర్ఘకాలిక దృష్టితో ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అన్ని దేశాలు తమ జాతీయ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా సైనిక శక్తిని పెంచుకుంటూ భవిష్యత్ ఘర్షణలకు సిద్ధమవుతున్నాయి.
అధునాతన యుద్ధ విమానాలు, దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలు, గగన భూభాగ దాడుల నుంచి రక్షణ కల్పించే ఆధునిక ఆయుధ ప్లాట్‌ఫాంల నిర్మాణం, ఆధునీకరణలో ఆయా దేశాలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.