మన హైదరాబాద్‌లో సీ-130జే విమానాల తయారీ? ఇదేగనక జరిగితే..
ఈ ఐకానిక్ విమానాల తయారీకి భారత్‌లో మెగా హబ్ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ అధికారులు ప్రతిపాదించారు. అమెరికా వెలుపల ఆ సంస్థ ఏర్పాటు చేసే తొలి గ్లోబల్ తయారీ కేంద్రంగా ఇది నిలుస్తుంది.
C-130J Super Hercules
C 130J Super Hercules: భారత్ 80 సైనిక రవాణా విమానాల కొనుగోలుకు సిద్ధమవుతున్న వేళ.. అమెరికా ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ తన సీ-130జే సూపర్ హెర్క్యులీస్ విమానాలను కొనాలని ఇండియాకు ప్రతిపాదించింది. సీ-130జే విమానాలు ఉంటే క్వాడ్ దేశాల మధ్య టాక్టికల్ ఎయిర్‌లిఫ్ట్ సామర్థ్యంలో భారత్‌కు మరింత బలం చేకూరుతుందని తెలిపింది.
సీ-130జే విమానాలు హైదరాబాద్‌లోనే పూర్తిస్థాయిలో తయారయ్యే ఛాన్స్ ఉంది. నగరంలోని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ లో ఇప్పటికే ఈ విమానాల తోక భాగాలను తయారుచేసి, యూఎస్‌కు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవలే 250వ యూనిట్‌ను టీఎల్‌ఎంఏఎల్ నుంచి అమెరికాకు ఎగుమతి చేశారు. ఇప్పటికే ఆ సంస్థకు హైదరాబాద్‌లో టీఎల్‌ఎంఏఎల్ ఉండడంతో అందులోనే ఈ భారీ విమానాలను తయారు చేస్తారని లాక్‌హీడ్ మార్టిన్ వర్గాలు అంటున్నాయి.
Also Read: బాల భరోసా పథకం: మీ పిల్లల ఆరోగ్యానికి భద్రత.. యాప్‌లో వివరాలు
కాగా, లాక్‌హీడ్ మార్టిన్‌కు అవకాశం లభిస్తే.. ఈ ఐకానిక్ విమానాల తయారీకి భారత్‌లో మెగా హబ్ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ అధికారులు తెలిపారు. ఇది అమెరికా వెలుపల ఆ సంస్థ ఏర్పాటు చేసే తొలి గ్లోబల్ తయారీ కేంద్రంగా నిలుస్తుంది.
ఇప్పటివరకు సీ-130జే సూపర్ హెర్క్యులీస్‌కు చెందిన 560కి పైగా విమానాలను లాక్‌హీడ్ మార్టిన్ సరఫరా చేసింది. ఈ ప్రముఖ టాక్టికల్ ఎయిర్‌లిఫ్ట్ విమానం 23 దేశాల్లోని 28 ఆపరేటర్ల సేవలో కొనసాగుతోంది.
భారత వైమానిక దళం ప్రస్తుతం 12 సీ-130జే విమానాలను వినియోగిస్తోంది. సాధారణ రవాణా వేరియంట్‌తో పాటు, స్పై డేటా సేకరణ, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, ప్రత్యేక దళాల మద్దతు, శోధన రక్షణ, కమాండ్ పాత్రల నిర్వహణకు వీలు ఉండే పలు ప్రత్యేక కాన్ఫిగరేషన్లను లాక్‌హీడ్ మార్టిన్ అందిస్తోంది. భారత్‌తో పాటు క్వాడ్ సభ్యదేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కూడా సీ-130జే విమానాలను వినియోగిస్తున్నాయి.
భారత్‌కు ఇదే బెస్ట్ చాయిస్: లాక్‌హీన్
“ప్రతి ఆపరేషన్ రంగంలోనూ సీ-130జే సూపర్ హెర్క్యులీస్ అత్యుత్తమ పనితీరును కనబర్చుతుంది. భారత్‌కు ఇదే బెస్ట్ చాయిస్” అని లాక్‌హీన్ మార్టిన్ ఎయిర్ మొబిలిటీ అండ్ మారిటైమ్ మిషన్స్ వైస్ ప్రెసిడెంట్ పట్రిషియా ట్రిష్ పేగన్ తెలిపారు. 2022లో, పాత సోవియట్ కాలపు ఏఎన్-32, ఐఎల్-76 విమానాలకు ప్రత్యామ్నాయంగా మధ్యస్థ రవాణా విమానాల కొనుగోలుకు భారత వైమానిక దళం ఆర్ఎఫ్‌ఐ జారీ చేసింది.
సుమారు 80 సైనిక రవాణా విమానాల కొనుగోలుకు ఐఎఎఫ్ ప్రణాళిక రూపొందించింది. మల్టీ బిలియన్ డాలర్ల ఈ కొనుగోలు ప్రతిపాదన రాబోయే కొన్ని వారాల్లో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం పొందే అవకాశం ఉంది.
బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్ తయారు చేసిన కేసీ-390 మిల్లేనియం, ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ రూపొందించిన ఏ-400ఎం విమానాలు కూడా ఎంటీఏ ప్రోగ్రాంలో పోటీలో ఉన్నాయి. ఎంటీఏ అంటే పాత రవాణా విమానాల స్థానంలో కొత్త మధ్యస్థ సైనిక రవాణా విమానాల కొనుగోలు ప్రోగ్రాం.
ఈ కార్యక్రమానికి సీ-130జే సూపర్ హెర్క్యులీస్ ప్రతిపాదన కోసం లాక్‌హీడ్ మార్టిన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది.
ప్రస్తుతం సీ-130జే విమానాల్లో కొత్త ఆవిష్కరణలను చేర్చే ప్రక్రియలో లాక్‌హీడ్ మార్టిన్ ఉంది. ఇందులో ఎఫ్-35 లైట్నింగ్ యుద్ధవిమానంలో కీలక భాగంగా ఉన్న డిస్ట్రిబ్యూటెడ్ అపర్చర్ సిస్టమ్ కూడా ఉంది.
డీఏఎస్ అనేది ఆరు ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలతో కూడిన గోళాకార సెన్సార్ వ్యవస్థ. ఇది పైలట్లకు సమగ్ర పరిస్థితి అవగాహన, క్షిపణి హెచ్చరిక, రాత్రి సమయంలోనూ చూసే సామర్థ్యాన్ని అందిస్తుంది.
లాక్‌హీడ్ మార్టిన్ ఏరోనాటిక్స్ సస్టైన్మెంట్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ రాడరిక్ మెక్‌లీన్ మాట్లాడుతూ.. ఎంటీఏ ప్రోగ్రాం భారత్-అమెరికా భాగస్వామ్యానికి కొత్త వ్యూహాత్మక విలువను అందిస్తుందని చెప్పారు. రక్షణ పరిశ్రమ బేస్ బలోపేతానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.
