B Abdul Nasar IAS
B Abdul Nasar: ఐఏఎస్ అధికారి కావాలనువారికి ఒకే మార్గం కనిపిస్తుంది. యూపీఎస్సీ పరీక్ష రాయడం, లక్షలాది రూపాయల ఖర్చు చేస్తూ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందడం, ఏళ్ల తరబడి చదవడం. ఆ సమయంలో మిగతా పనులన్నీ వదిలేయాలి. ఐఏఎస్‌పై మాత్రమే దృష్టి ఉంచాలని అందరూ భావిస్తారు. కానీ, ఈ దారిలో వెళ్లకుండానే ఐఏఎస్ హోదా వరకు చేరుకున్నారు కేరళకు చెందిన బి. అబ్దుల్ నాజర్. అనాథాశ్రమ జీవితం, చిన్న చిన్న పనులతోనే జీవనం సాగిస్తూ ఐఏఎస్ హోదా వరకు చేరుకున్నారు ఆయన.
నాజర్ తన బాల్యాన్ని అంతా కన్నీటి కడలిలో ఈదారు. నాజర్‌కు ఐదేళ్ల వయసులో ఆయన తండ్రి మృతి చెందారు. ఇది ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా కుదిపేసింది. తల్లి ఇతరుల ఇళ్లలో పనిచేసినా డబ్బు సరిపోలేదు. చివరికి నాజర్, ఆయన తోబుట్టువులు కేరళలోని ఒక అనాథాశ్రమంలో 13 ఏళ్లు గడపాల్సి వచ్చింది.
ఆ వయసులో ఆటలు, స్నేహాలు ఉండాలి. కానీ నాజర్ జీవితంలో బాధ్యతలు, ఆకలి, కష్టపడి చదవాలనే సంకల్పం మాత్రమే ఉండేవి.
పదేళ్లకే కుటుంబ భారాన్ని మోయడం ప్రారంభించారు నాజర్. స్కూల్ చదువుతో పాటు, హోటళ్లలో క్లీనర్‌గా పనిచేసి పొట్టకూటి కోసం సంపాదించారు. అదొక్కటే కాదు, న్యూస్‌పేపర్లు వేయడం, విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం, ఫోన్ ఆపరేటర్‌గా పనిచేయడం వంటి ఎన్నో పనులు చేశారు.
కానీ ఒక విషయాన్ని మాత్రం ఆయన వదల్లేదు.. అదే చదువు. ఏ పనిలో ఉన్నా, విద్యే తనను ముందుకు నడిపే మార్గమని గట్టిగా నమ్మి, ఆ లక్ష్యం వైపు దూసుకెళ్లారు.
నాజర్ నిరంతర కృషి ఫలించింది. కష్టపడి చదివి, కేరళ ప్రభుత్వంలో హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం సంపాదించారు. యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యే స్తోమత లేకపోయినా, ఆయన రాష్ట్ర ప్రభుత్వ సేవల ద్వారా అత్యున్నత స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ) పరీక్షలో విజయం
నాజర్ (B Abdul Nasar) పీఎస్సీ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచి, 2006లో డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇది సాధారణ విజయం కాదు.. ఆయన ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం.
డిప్యూటీ కలెక్టర్‌గా పని చేసిన సమయంలో, నాజర్ చేసిన సేవలు, కృషి, ప్రజల పట్ల అంకితభావం ఉన్నతాధికారులను ఆకట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి పదోన్నతి ద్వారా ఐఏఎస్ హోదా ఇస్తారు.
ఆ విధంగా, నాజర్ ఐఏఎస్ అధికారిగా పదోన్నతి పొందారు. 2019 నుంచి 2021 వరకు కొల్లం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేరళ ప్రభుత్వ మత్స్యశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
బి.అబ్దుల్ నాజర్ జీవితం మనకు చెబుతున్న ఒకే ఒక సత్యం – పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదు.
డబ్బులేకపోయినా చదువుకోవచ్చు.
అనాథాశ్రమంలో ఉన్నా కలలు కనవచ్చు.
చిన్న చిన్న పనులు చేస్తూ కూడా, పెద్ద లక్ష్యాలను సాధించవచ్చు.
నమ్మకం, కృషి, అంకితభావం ఉంటే జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా మనం గెలుస్తామని నాజర్ నిరూపించారు.
బి.అబ్దుల్ నాజర్ కథ మనందరికీ ఓ స్ఫూర్తి. ఐఏఎస్ కావాలంటే తప్పనిసరిగా కోచింగ్, యూపీఎస్సీ పరీక్ష అవసరం లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చినా, ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, మన లక్ష్యంపై నిలకడగా కష్టపడితే మనకీ విజయం సాధ్యమే.
అందుకే మనమంతా ఆయన జీవితం నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి.. కలలు కనండి, వాటి కోసం ఎప్పటికీ పోరాటం ఆపవద్దు.