Viral Video
Viral Video: సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వీడియోలు ఉంటాయి. వాటిలో కొన్నింటిని చూస్తే.. అలసిన మనసు ప్రశాంతతను పొందుతుంది. అటువంటి వీడియోనే ఇది. ఓ బస్సు డ్రైవర్ చేసిన చిన్న పని అందరినీ ఆకర్షిస్తోంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ రోడ్లపై చాలా మంది చిన్నారులు ఆకలి బాధతో కనపడుతున్నారు.
వారిని చాలా మంది చూస్తూ వెళ్తుంటారేగానీ చిన్న సాయం కూడా చేయరు. అయితే, ఓ బస్సు డ్రైవర్ మాత్రం ఇద్దరు చిన్నారులను చూసి అలాగే వెళ్లిపోలేదు. రోడ్డుపై ఆకలితో ఉన్న ఇద్దరు చిన్నారులకు ఆ డ్రైవర్ బిస్కెట్ ప్యాకెట్లు అందించాడు. ఆ సమయంలో ఒకరు వీడియో తీశారు. ట్రిప్స్ గ్రామ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా, ఇది సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
డ్రైవర్ చేసిన సాయం చిన్నదే అయినప్పటికీ ఆయన చిన్నారుల పట్ల చూపిన ప్రేమను నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆ డ్రైవరు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణాలో పనిచేస్తున్నాడు. కేరళలోని పథనంతిట్టా ప్రాంతం మీదుగా వెళ్తూ ఇద్దరు చిన్నారులను చూసిన ఆ డ్రైవరు తన వద్ద ఉన్న బిస్కెట్ ప్యాకెట్లను అందించాడు. దీంతో అతడు ఇస్తున్న బిస్కెట్ ప్యాకెట్లను ఆ ఇద్దరు చిన్నారులు చిరునవ్వుతో స్వీకరించారు. ఆ సమయంలో వారి ముఖంలో కనపడిన ఆనందం అంతాఇంతా కాదని నెటిజన్లు కామెంట్లు చేశారు.