అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్‌ అంటే ఏంటి? అది ఎందుకు కీలకం? దొరికాక ఏం చేస్తారు?

విమానం కుప్పకూలిపోవడానికి కారణాలు బ్లాక్ బాక్స్ దొరికితే తెలుస్తుంది.

అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌ బయలుదేరిన ఏఐ-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. మేఘనీగర్ ఘెడాసర్ క్యాంప్ ప్రాంతంలోని నివాస ప్రాంతాల్లో అది కూలింది. ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ AI-171 విమానంలో మొత్తం 242 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.

డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం.. బోయింగ్ 787 విమానం రన్‌వే 23 నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు టేకాఫ్ అయింది. కొన్ని క్షణాల్లో ‘MAYDAY’ సిగ్నల్ పంపింది. ఆ తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ నుంచి రావాల్సిన కమ్యూనికేషన్‌కి స్పందించలేదు. విమానం ఎయిర్‌పోర్ట్ ప్రిమిటర్ బయట కూలిపోయింది. విమానం కుప్పకూలిపోవడానికి కారణాలు బ్లాక్ బాక్స్ దొరికితే తెలుస్తుంది.

బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి?
బ్లాక్ బాక్స్ అంటే ఫ్లైట్ ప్రమాదానికి గురైనప్పుడు ఆ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక రికార్డింగ్ డైవైజ్. దీన్ని వాడుక భాషలో “బ్లాక్ బాక్స్” అని పిలుస్తారు. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు ఇందులో ఉంటాయి. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడం, ప్రమాదం దర్యాప్తునకు ఇది ఉపయోగపడుతుంది.

దీని ద్వారా ప్రమాద కారణాలను తెలుసుకుంటారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా దీని ద్వారా చర్యలు తీసుకోవచ్చు. బ్లాక్ బాక్స్‌లోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ విమాన వేగం, భూతలం నుంచి అది ఎంత ఎత్తులో ఉంది, ఏ దిశలో ఉంది, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది.

ఇక కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ పైలట్, ఇతర సిబ్బంది మధ్య సంభాషణను రికార్డ్ చేస్తుంది. పేరు బ్లాక్ బాక్స్ అయినా, ఇది నారింజ రంగులో ఉంటుంది. విమానం తగలబడి పోయినా, అన్ని ప్రమాదాలను తట్టుకునేలా బ్లాక్‌ బాక్స్‌ను ప్రత్యేకంగా చేస్తారు. ఇందులోని రెండు రికార్డర్లు తీవ్రమైన వేడి, నీటి ఒత్తిడి, పేలుళ్లు వంటి పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా తయారవుతాయి.

విమానం కూలే ముందు ఏం జరిగింది? అన్నదానికి బ్లాక్ బాక్స్ నుంచి స్పష్టమైన వివరాలు తీసుకోవచ్చు. ఇందులో డేటా ఆధారంగా.. ప్రమాదానికి యాంత్రిక లోపం కారణమా? బర్డ్‌స్ట్రైక్ లేదా గాలిలో ఎదురైన అడ్డంకి కారణమా? లోపల ఏవైనా పేలుళ్లు సంభవించాయా? మంటలు చెలరేగాయా? పైలట్ వైఫల్యం వంటి అంశాలపై స్పష్టత వస్తుంది. పైలెట్ MAYDAY చెప్పారా? విమానాన్ని కాపాడే ప్రయత్నం చేశారా? అన్న విషయాలన్నీ ఇందులో రికార్డవుతాయి.

బ్లాక్ బాక్స్ లభించాక ఏం చేస్తారు?
ప్రస్తుతం బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. రెస్క్యూ పూర్తయిన వెంటనే దాన్ని వెలికితీస్తారు. అది దొరికిన తరువాత బ్లాక్ బాక్స్‌ను డిజీసీఏ లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AAIB ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ మెమొరీ డేటా డీకోడ్ చేస్తారు. ఆడియో, డేటాను తీస్తారు. రాడార్, ATC లాగ్స్‌తో అనుసంధానిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజులు నుంచి వారం వరకు పడవచ్చు.

గతంలో బ్లాక్ బాక్స్ ద్వారానే దర్యాప్తు
జర్మన్‌వింగ్స్‌ విమాన ప్రమాదం (2015), మలేసియా ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాద కేసులు, 2020 కోజికోడ్ విమాన ప్రమాదం దర్యాప్తుల్లో బ్లాక్ బాక్స్ కీలక ఆధారమైంది. అప్పట్లో కూడా పైలట్ నిర్ణయాలు, రన్‌వే పరిస్థితులు అన్నీ దీని ద్వారానే తెలిశాయి. సాక్ష్యాలు లేకుండా జరిగిన ప్రమాదాల్లోనూ, బ్లాక్ బాక్స్‌ ద్వారానే నిజాలు వెలుగులోకి వచ్చాయి.