Sehar Shinwari : భార‌త్ పై పాకిస్థాన్‌ న‌టి అక్క‌సు.. టీమ్ఇండియాని ఓడిస్తే మ‌ట‌న్ బిర్యానీ..

భార‌త జ‌ట్టు సాధించిన ఘ‌న విజ‌యాన్ని చూసి కొంద‌రు పాకిస్థాన్ ఫ్యాన్స్ త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టుపై బుర‌ద చ‌ల్ల‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు.

Sehar Shinwari

Pakistani actor Sehar Shinwari : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భాగంగా అక్టోబ‌ర్ 14న భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో భార‌త్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ పై వ‌రుస‌గా 8 విజ‌యాలు సాధించిన రికార్డును నెల‌కొల్పింది. భార‌త జ‌ట్టు సాధించిన ఘ‌న విజ‌యాన్ని చూసి కొంద‌రు పాకిస్థాన్ ఫ్యాన్స్ త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టుపై బుర‌ద చ‌ల్ల‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఇక పాకిస్థాన్ న‌టి సెహ‌ర్ షిన్వారీ అయితే బంఫ‌ర్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తోంది.

భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతున్న‌ప్పుడు బంగ్లా క్రికెట‌ర్ల‌కు ఓ ఆఫ‌ర్ ఇచ్చింది. టీమ్ఇండియాను ఓడిస్తే తాను ఓ బంగ్లా క్రికెట‌ర్‌తో క‌లిసి డేట్‌కు వెళ్తాన‌ని చెప్పింది. అయితే అమ్మ‌డి కోరిక నెర‌వేర‌లేదు. దీంతో ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెట‌ర్ జిమ్మీ నీష‌మ్ ఓ ఆఫ‌ర్‌ని ఇచ్చింది. ‘నువ్వు గ‌నుక భార‌త్‌ను ఓడిస్తే మేము(పాకిస్థానీయులం) త‌దుప‌రి ప్ర‌ధానిగా ఎన్నుకుంటాం.’ అని ఓ ట్వీట్ చేసింది.

అయితే.. న్యూజిలాండ్ తుది జ‌ట్టులో జిమ్మీ నీష‌మ్ కు స్థానం ద‌క్క‌లేదు. అయిన‌ప్ప‌టికీ వ‌రుస ట్వీట్లు చేస్తోంది. కివీస్‌ చేతిలో భార‌త్‌ ఓడిపోతే.. అబ్దుల్లా షా ఘాజీ దర్గాలోని పేదలకు మటన్ బిర్యానీ పంచిపెడతానని మాటిచ్చింది.

అంతేనా.. టీమ్ఇండియా ఏ మ్యాచ్‌లోనూ ఎప్పుడూ గెలవకూడదంటూ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్లు వైర‌ల్‌గా మార‌గా.. భార‌త అభిమానులు గ‌ట్టిగానే గ‌డ్డి పెడుతున్నారు.