తూర్పుగోదావరి జల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీస్తున్నారు. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాల్లో నెలల వయస్సున్న చిన్నారి కూడా ఉండడం అందర్నీ కలిచివేస్తోంది. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపులు కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం బోటు మునిగిపోయింది. సమాచారం తెలుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్‌డీఆర్ఎఫ్, ఓఎన్జీసీ, నేవీకి చెందిన వారు గాలిస్తున్నారు. 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఘోర ప్రమాదంతో ఎన్నో కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. తమ వారు ఇక తిరిగిరారని తెలుసుకున్న వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన 12 మంది గల్లంతు కావడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు అధికంగా ఉన్నారు. సోమవారం ప్రమాదాస్థలిని సీఎం జగన్ పరిశీలించనున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆదివారం పోశమ్మ గండి నుంచి 71మందితో రాయల్ వశిష్ట బోటు పాపికొండలకు బయలుదేరింది. కాసేపటికే బోటు మునిగిపోయింది. ఇందులో 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. మొత్తం 13 మృతదేహాలు బయటపడ్డాయి.