ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు

  • Publish Date - December 21, 2019 / 06:47 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన నిర్ణయాలతో తనదైన శైలిలో పారిపాలిస్తూ దూసుకువెళ్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 13జిల్లాలను 25జిల్లాలుగా మార్చేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.

విశాఖపట్నంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జగన్‌ జన్మదిన వేడుకలల్లో పాల్గొన్నారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదనను జగన్ తీసుకుని వచ్చినట్లు చెప్పారు. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చారిత్రక  నిర్ణయం అని అన్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలనేదే జగన్ ఆకాంక్ష అని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో 3 రాజధానులు వస్తున్నాయని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పెకొచ్చారు. తెలుగుదేశం హయాంలో ఐదేళ్లలో జరగని అభివృద్ధిని 5 నెలల్లో జగన్‌ చేసి చూపించారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ జెండా ఎగరడం ఖాయమని, అందుకు తగ్గట్లుగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.