వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు: 30ఇయర్స్ పృథ్వీ

  • Publish Date - February 24, 2020 / 10:08 AM IST

ఎస్‌వీబీసీ ఛానల్ ఉద్యోగినితో అసభ్యకరంగా ఫోన్‌లో మాట్లాడినట్లు ఆరోపణలు రావడంతో ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తనపై వచ్చిన ఆరోపణలు, ఫోన్ సంభాషణ వివాదంపై మరోసారి మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణల కారణంగా మానసికంగా ఎంతో ఇబ్బందిపడ్డానని, ఎస్‌వీబీసీ ప్రక్షాళనకు ప్రయత్నించడంతో తనకు ఇటువంటి గిఫ్ట్ ఇచ్చారని అన్నారు పృథ్వీ.

ఎస్‌వీబీసీలో కొందరు ఉద్యోగులు తనకు వెన్నుపోటు పొడిచారని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. జీవితాంతం తాను వైసీపీలోనే ఉంటానని, శ్రీవారి ఆశీస్సులు ఉంటే మళ్లీ ఎస్‌వీబీసీ ఛైర్మన్‌ అవుతానని ధీమా వ్యక్తం చేశారు పృథ్వీరాజ్. ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత చాలా రోజులకు మీడియా కంటపడిన పృథ్వీ, తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు వెళ్లారు. 

తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆడియోను మార్చేసి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. నిజం త్వరలోనే బయటకు వస్తుందని అన్నారు. ఎస్‌వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన జగన్‌కు చెడ్డ పేరు తీసుకు రావడం ఇష్టం లేక పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు చెప్పారు. సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డిలకు మాత్రమే తాను జవాబుదారిగా ఉంటానని అన్నారు.