అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించేందుకు 46,397 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో 45,920 పోలింగ్ స్టేషన్లు ఉండగా పెరిగిన ఓటర్లను దృష్టిలో ఉంచుకొని 477 పోలింగ్ సెంటర్లను పెంచినట్లు ఆయన చెప్పారు. విజయనగరం జిల్లాలో ఒక్క పోలింగ్ కేంద్రం కూడా పెరుగలేదన్నారు. 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
ఏపి అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,395 మంది అభ్యర్ధులు, పార్లమెంట్ బరిలో 344 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయ్యిందని ఆయన చెప్పారు. ఓటరు ఎపిక్ కార్డులు పంపిణీ ఏప్రిల్ 7 వ తేదిలోగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇవిఎంలపై ఉన్న అపోహలను తొలగించేందుకు హైకోర్టు ఛీఫ్ జస్టిస్, ఇతర జస్టిస్ ల ఎదుట వాటి పనితీరును ప్రదర్శించనున్నామని ఆయన తెలిపారు.