వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆయేషా తల్లి శంషాద్ బేగం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం దిశ చట్టం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రోజా ఆయేషా హత్యపై మాట్లాడితే బాగుండేదన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆయేషా తల్లి శంషాద్ బేగం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయేషా హత్య జరిగినప్పుడు రోజా హడావుడి చేశారని తెలిపారు. ప్రస్తుతం రోజా ఎమ్మెల్యేగా ఉండి ఆయేషా హత్యకేసుపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం దిశ చట్టం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రోజా ఆయేషా హత్యపై మాట్లాడితే బాగుండేదన్నారు.
సీబీఐ ద్వారా తన బిడ్డకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని శంషాద్ బేగం తెలిపారు. ఆయేషాకు న్యాయం జరగాలని దేశం కోరుకుంటుందన్నారు. రాష్ట్రంలో దిశ చట్టం శుభపరిణామం చెప్పారు. దిశ చట్టం చేస్తున్న సమయంలో ఆయేషా హత్యను ప్రస్తావిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యాచారం కేసులో మరోసారి సీబీఐ విచారణ వేగవంతం చేసింది. 12 సంవత్సరాల తర్వాత మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు రీ-పోస్టుమార్టం చేస్తున్నారు. సీబీఐ అధికారుల పర్యవేక్షణలో.. కుల పెద్దలు, కుటుంబసభ్యుల పెద్దలు సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో 2007 డిసెంబర్ 27న ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. అత్యాచారం చేసి ఆమెని చంపేశారు.
ఈ కేసులో పోలీసులు మహిళా కోర్టుకు అందించిన ఆధారాల్లో చూపిన డీఎన్ఏ నిజంగా ఆమెదేనా అనే సందేహం రావడంతో.. సీబీఐ అధికారులు రీ-పోస్టుమార్టం కోసం కోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రీ-పోస్టుమార్టం నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో శనివారం(డిసెంబర్ 14,2019) రీ-పోస్టుమార్టం చేస్తున్నారు. ఆయేషా మీరా డీఎన్ఏ ని సీబీఐ అధికారులు మరోసారి సేకరించనున్నారు.
ఈ కేసులో న్యాయం కోసం ఆయేషా తల్లిదండ్రులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయేషా డీఎన్‌ఏ టెస్ట్‌కు.. ముందు మత పెద్దలు అంగీకరించలేదు. దీంతో కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్నారు సీబీఐ అధికారులు. ఈ కేసును చేపట్టినప్పటి నుంచి సీబీఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అన్ని కోణాల్లో దర్యాప్తును ముందుకు తీసుకెళుతోంది. 2019 జనవరిలో.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సత్యంబాబును ప్రత్యేకంగా ప్రశ్నించింది. అతని ఇంటికే వెళ్లి కేసుపై గుచ్చి గుచ్చి అడిగింది సీబీఐ టీమ్. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా దృష్టి పెట్టింది సీబీఐ టీమ్. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఆయేషా తల్లిదండ్రుల దగ్గర డీఎన్ఏను కూడా సేకరించారు.