గిరిజన గూడాల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొలంగూడలో ఘటన ఆదివాసి గ్రామాల్లోని దుర్భర పరిస్థితిని కళ్లకు కుడుతోంది. గ్రామంలో జరిగిన పెళ్లిలో విందు భోజనం తిని ముగ్గురు మృతి చెందగా.. 25మంది ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇందుకు ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఘటన జరిగిన వెంటనే.. సమాచారం ఇచ్చినా.. అధికారులు స్పందించలేదు. 108 వాహనం రాకపోవడంతో.. స్పాట్‌లోనే ఓ చిన్నారి మృత్యువాత పడింది. నార్నూర్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో… అత్యవసర చికిత్స అందిస్తున్న కొందరిని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మరో చిన్నారి మరణించింది. ఉట్నూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ. మరో చిన్నారి ప్రాణాలు విడిచింది. అందరూ చూస్తుండగానే.. ముగ్గురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ముగ్గురు చనిపోవడంతో.. మానవ హక్కుల వేదిక సభ్యులు.. కొలంగూడలో పర్యటించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. గూడెంలో గిరిజనుల జీవన విధానాన్ని చూసి వారంతా ఖంగుతిన్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. ఊరు మొత్తానికి ఒకటే బోరు. ఎండాకాలం కావడంతో.. అది పనిచేయడం లేదు. దీంతో.. ఊరిలోని బావులు, చెలిమలు, కుంటల్లోని నీటినే గ్రామస్థులు వినియోగిస్తున్నారు. ఆకుపచ్చగా.. పాకురు పట్టిన నీటిని బట్టతో వడపోసి.. తాగేస్తున్నారు. ఈనెల 6వ తేదీన గ్రామంలో జరిగిన వివాహంలో ఈ నీటితోనే వంటలు చేశారు. మరుసటి రోజు మిగిలిన భోజనాన్ని తినడంతోపాటు.. ఈ పచ్చ రంగు నీళ్ళని తాగడంతో.. వాంతు, విరేచనాలతో ముగ్గురు చనిపోయారు. మిగిలిన వారు ఆస్పత్రి పాలయ్యారు.
దేశానికి స్వాతంత్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా చెట్టు, పుట్ట, గుట్టనే నమ్ముకొని బతుకుతున్న ఆదివాసుల జీవితాల్లో మార్పురావడం లేదు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమరంభీం వారసులు, నేటికీ కనీస హక్కులకు నోచుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం పేరిట ఏటా కోట్లాది నిధులు విడుదల చేస్తున్నా అడవిబిడ్డల దరిచేరడం లేదు. అధికారుల అవినీతి, దళారుల దోపిడీ, మైదాన ప్రాంతవాసుల ఆధిపత్యంతో అడవిబిడ్డలు నేటికీ దారిద్య్రంలో మగ్గుతున్నారు. సరైన విద్య, వైద్యం, మౌలిక వసతులు అందుబాటులోకి రావడం లేదు. ఫలితంగా కరువు కాటకాలు, రోగాలతో అల్లాడుతున్నారు. మనుగడ కోసం పోరాటంలో అలసి, సొలసిపోతున్నారు.
ఆదివాసీ గ్రామాల్లోని పిల్లలకు పోషకాహారం అందని ద్రాక్షగానే ఉంది. గర్భిణిలు, పిల్లలు పోషకాహార లోపంతో రోగాల భారిన పడుతున్నారు. కొలాంగూడ, లక్ష్మిపూర్, తిరుమలాపూర్ గిరిజన గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు లేకపోవడంతో పిల్లలు పోషకాహారానికి దూరమై అనారోగ్యం పాలవుతున్నారు. మరి కొన్ని గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ నామమాత్రంగానే కొనసాగుతోంది. దీంతో గిరిజనుల పిల్లలకు పౌష్టికమైన ఆహారం అందక గంజి, గట్కలతో కడుపు నింపుకుంటున్నారు. గర్బిణీలు, చిన్నపిల్లలు రక్త హీనతతో చనిపోతున్నారు. ఏ చిన్న రోగమొచ్చినా పిట్టల్లా రాలిపోతున్నారు. అపరిశుభ్ర ఆహారం, శుభ్రత లేని నీరు తాగి ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఇక్కడున్న అధికారులు ఎంత కారణమో.. నాయకులు కూడా అంతేకారణమని మానవ హక్కుల నేతలు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆదివాసీలకు కనీస అవసరాలను కల్పించాలని డిమాండ్ చేశారు.
గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే వాగులు, వంకలు దాటు కుంటూ వెళ్లాల్సిందే. సమస్యలతో సతమతమౌతున్న గిరిజన గ్రామాలకు కనీస సదుపా యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయనే విమర్శలున్నాయి. వాగులపై వంతెలను నిర్మించాలని ఏళ్ల తరబడి ప్రజలు అధికారులను కోరుతున్నా వారి గోడు పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. వర్షాకాలంలో వాగులు పొంగి పోర్లుతుంటే ప్రమాదపుటంచున రాకపోకలు సాగిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేక అనారోగ్యంతో ఉన్నవారికి సరైన సమయంలో వైద్యమందక మృతి చెందిన ఘటనలు చాలా ఉన్నాయి.
కొలంగూడకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో.. రాళ్లురప్పల మధ్య నడలేని పరిస్థితి నెలకొంది. గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం మరీ అధ్వానంగా ఉంది. ప్రతి వర్షకాలం పారిశుధ్యలోపంతో రోగాలు ప్రబలి ప్రజలు మృతిచెందుతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో డ్రెయినేజీలు నిర్మించలేదు. దీంతో మురికినీరు నిలిచి, దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇలా అనేక సమస్యలతో గిరిజన గ్రామాలు సతమతమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆదివాసీ గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.