మొన్న ట్రాక్టర్ పై అసెంబ్లీకి తేజస్వీ..నేడు ఎలక్ట్రిక్ స్కూటీపై సెక్రటేరియట్ కు మమత

Scooter ఆయిల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర వంద దాటింది. పెరుగుతున్న ఆయిల్ ధరలపై ఇటు సమాన్యప్రజలు,అటు విపక్ష పార్టీల నేతలు తమదైన శైలిలో మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు విపక్ష పార్టీల నాయకులు పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదలపై వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు,పార్టీ నాయకులు,ముఖ్యమంత్రులు సైకిళ్లు,స్కూటర్లు,ట్రాక్టర్లపై అసెంబ్లీలకు వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

గత వారం బీహార్ లో ఆర్జేడీ ఎమ్మెల్యే ముకేశ్‌ రౌషన్‌ అసెంబ్లీకి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. తన ఇంటి నుంచి దాదాపు 5గంటలపాటు సైకిల్ తొక్కుకుంటూ ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఈ వారం ప్రారంభంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్..తన నివాసం నుంచి ట్రాక్టర్‌ను నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటం, గ్యాస్ ధర ఊహించనంతగా పెరగడంపై, అదేవిధంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తోన్న రైతులను కేంద్రం పట్టించుకోవట్లేదని తన నిరసన తెలియజేస్తూ, రైతులకు సంఘీభావంగా తన నివాసం నుంచి ట్రాక్టర్‌ను నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. ద్రవ్యోల్బణం అదుపు చేస్తామని చెప్పి బీజేపీ అధికారంలోకి వచ్చిందని..కానీ ఆయిల్ ధరలు,ఎల్పీజీ సిలెండర్ ధరలు చుక్కలనంటాయంటూ తేజస్వి మండిపడ్డారు.

ఇక,ఇప్పుడు తాజాగా తేజస్వీని వెస్ట్ బెంగాల్ సీఎం మమత ఫాలో అయినట్లు కనిపించింది. పెరుగుతున్న పెట్రోల్, డీజీల్‌ ధరలపై కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా..సచివాలయానికి ఎలక్ట్రిక్‌ స్కూటర్ పై వెళ్లారు. మమత స్కూటీ వెనకు కూర్చొగా..కోల్ కతాలోని హజ్రా ఎక్స్ట్రా ప్రాంతం నుంచి నబన్నా ఏరియాలోని రాష్ట్ర సెక్రటేరియట్ కి హుగ్లీ నది బ్రిడ్జ్ మీదుగా ఎలక్ట్రిక్ స్కూటర్ పై చేరుకుంది మమత. ఆ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ స్కూటర్‌ను నడుపగా, మమతా హెల్మెట్‌ ధరించి వెనక సీట్లో కూర్చున్నారు. సీఎం కార్యాల‌యానికి దీదీ స్కూట‌ర్‌పై వెళ్తున్న దృశ్యాల‌ను అన్ని స్థానిక ఛాన‌ళ్లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశాయి.

కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే సామాన్యులపై అదనపు భారం పడుతోందని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. ఇంధన ధరల పెంపు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ప్ర‌భుత్వం ఎల్‌పీజీ, డీజిల్ ధ‌ర‌ల‌ను రోజూ పెంచుతోంద‌ని, ఇది ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు ఆరోపించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే కేంద్ర ప్ర‌భుత్వం ఇంధ‌న ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తుంద‌ని పేర్కొన్నారు. మోడీ, అమిత్‌ షా..దేశాన్ని అమ్మేస్తున్నారని, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు