జగన్ చేతుల మీదుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కులు

  • Publish Date - November 7, 2019 / 04:04 AM IST

ఐదేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ డిపాజిట్ డబ్బులు ఎట్టకేలకు అందబోతున్నాయి. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే సభలో ఇవాళ(నవంబర్ 7వ తేదీ) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కులు ఇస్తుంది ప్రభుత్వం. తొలివిడతలో 3లక్షల 69వేల 655 మందికి సంబంధించిన డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది.

రూ.10 వేలలోపు డిపాజిట్లు చేసిన వారికి తొలుత చెల్లింపులు చేస్తారు. తర్వాతి దశలో రూ.20వేల లోపు డిపాజిట్లు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం. ప్రతి బాధితుడికి న్యాయం చేసేలా కార్యాచరణ చేపట్టింది ప్రభుత్వం ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.264 కోట్లను విడుదల చేసింది.

విజయవాడ కేంద్రంగా అగ్రిగోల్డ్‌ సంస్థ దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని 19.19 లక్షల మందితో రూ.6,380 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించింది. అయితే టైమ్ పిరియడ్ ముగిసినా కూడా బాండ్లకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో మోసపోయినట్లు గ్రహించారు డిపాజిటర్లు. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలంటూ ఐదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు అగ్రగోల్డ్ బాధితులు.