ఏపీ కేబినెట్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. మే 14న సమావేశం జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంతవరకు ఎలాంటి అనుమతి రాలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం ఇటు ముఖ్యమంత్రి, అటు అధికారులు ఎదురుచూస్తున్నారు.
కేబినెట్ అజెండాను ఆమోదించి స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ పంపారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఈసీ అనుమతి లభించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. మే 13వ తేదీ సోమవారం వరకే సమయం ఉండడంతో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఈసీఐ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ సెలవులో ఉన్నారు.
వాస్తవానికి మే 10నే కేబినెట్ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు భావించారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరైంది. దీంతో 10వ తేదీన స్క్రీనింగ్ కమిటీ సమావేశమై… అజెండాలోని అంశాలను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి అనుమతి కోరింది. నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అదే ప్రకారం 10వ తేదీనే ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. ఆదివారంతోనే 48 గంటలు పూర్తయ్యాయి. అయినా ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
మే 12వ తేదీ ఆదివారం 6వ విడత ఎన్నికలు జరిగాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి తీరిక ఉండడం లేదు. దీంతో ఏపీ ప్రభుత్వం పంపిన నివేదికను పరిశీలించలేదు. మే 13వ తేదీ సోమవారం ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించి తన నిర్ణయాన్ని తెలిపే అవకాశముంది. సాయంత్రంలోగా కేబినెట్ మీటింగ్ ఏర్పాటుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలా.. వద్దా అన్నది తేలిపోనుంది.
ఒకవేళ ఈసీ అనుమతి ఇచ్చినా… మే 14వ తేదీ మంగళవారం కేబినెట్‌ను సమావేశపర్చడం మాత్రం సాధ్యం కాకపోవచ్చని సీఎం కార్యాలయం భావిస్తోంది. దీంతో ఈనెల 14న కేబినెట్ జరుగుతుందా… లేక మరోరోజు జరుగుతుందా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.