అనంతపురం జిల్లా ఆత్మకూరు, రాప్తాడులో ఘర్షణలు

  • Publish Date - April 11, 2019 / 07:28 AM IST

ఏపీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఎన్నికలు కదనరంగాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు మాటలకు మాత్రమే పరిమితమయిన నేతలు బాహాబాహికి దిగారు. కర్రలతో కొట్టుకుంటున్నారు. తలలు పగులుతున్నాయి. ఏకంగా పోలింగ్ కేంద్రంలో దాడులకు దిగుతున్నారు. తాడిపత్రిలో వైసీపీ – టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి చనిపోయాడు. అనంతపురం జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు మానిటరింగ్ చేస్తున్నా దాడులు జరుగుతున్నాయి. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఘర్షణలు తలెత్తుతున్నాయని సమాచారం. ప్రశాంతంగా ఉండే జిల్లాల్లో సైతం ఘర్షణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

ఆత్మకూరు.. రాప్తాడులో ఉద్రిక్తత :
ఆత్మకూరులో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. మేకపాటి అనుచరులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మేకపాటి గౌతంరెడ్డిపై టీడీపీ నేత కొమ్మి లక్ష్మీనాయుడు వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీనితో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

రాప్తాడు నియోజకవర్గంలోనూ టెన్షన్ ఉంది. ఓ పోలింగ్ బూత్‌లోకి టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో వెళుతుండగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సనప గ్రామంలో టీడీపీ – వైసీపీ నేతలు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలింగ్ బూత్‌లోనే ఘర్షణ జరగడంతో గందరగోళం నెలకొంది. ఓటర్లు బయటకు పరుగులు తీశారు. గొడవల్లో ఈవీఎం పగిలిపోయింది. పలువురికి గాయాలయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు