మంగళగిరిలో ఉద్రిక్తత : ధర్నాకు దిగిన లోకేష్

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్‌పేట పోలింగ్‌ కేంద్రం ధర్నాలతో దద్దరిల్లింది. టీడీపీ, వైసీపీ ఆందోళనలతో అట్టుడికింది.

  • Publish Date - April 12, 2019 / 01:37 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్‌పేట పోలింగ్‌ కేంద్రం ధర్నాలతో దద్దరిల్లింది. టీడీపీ, వైసీపీ ఆందోళనలతో అట్టుడికింది.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్‌పేట పోలింగ్‌ కేంద్రం ధర్నాలతో దద్దరిల్లింది. టీడీపీ, వైసీపీ ఆందోళనలతో అట్టుడికింది. ఏప్రిల్ 11వ తేదీ ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని..గంటల తరబడి క్యూలో నిల్చున్నా ఓటేయడానికి అవకాశం కల్పించడం లేదని..టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 65 పోలింగ్‌ బూత్‌లలో EVMలు, VV ప్యాట్‌లు పదేపదే మొరాయించాయి. దీంతో గంటల పాటు పోలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. మూడు నాలుగు సార్లు ఇంటికి వెళ్లి..ఓటు వేయడానికి తిరిగి కేంద్రానికి చేరుకున్నా.. ఈవీఎంలు పనిచేయకపోవడంతో టీడీపీ కార్యకర్తలు నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.
Read Also : బద్దకించిన నగరవాసులు : హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్

సాయంత్రం 6 గంటల సమయంలో మరో 500 మంది ఓటేయడానికి వచ్చారు. ఇదే సందర్భంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌ వచ్చి ఓటర్లకు మద్దతుగా సమయాన్ని పొడిగించాలని కోరారు. ఎన్నికల కమిషనర్‌కు ఫోన్‌ చేసి  మాట్లాడుతుండగా వైసీపీ కార్యకర్తలు లోకేష్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ఓ దినపత్రిక విలేకరి, కొందరు  వైసీపీ కార్యకర్తలతో అక్కడికి వచ్చి ఓటర్లు కాని వారిని పోలింగ్‌ బూత్‌ దగ్గరకు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఇక్కడ వారు ఉండటానికి వీల్లేదంటూ లోకేష్‌తో వాగ్వాదానికి దిగారు. ఓటర్లు కాని వారు తనవెంట ఎవరూ లేరని లోకేష్‌ చెబుతున్నా వినిపించుకోలేదు. దీంతో లోకేష్‌ సదరు మీడియా ప్రతినిధిపై మండిపడ్డారు. తనను ప్రశ్నించడానికి మీరెవరంటూ నిలదీశారు. అనంతరం ఆయన అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.

పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అధ్వానంగా ఓటర్లను చూస్తున్నారని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువులకన్నా హీనంగా చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం వచ్చి ఓటర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓటు వేయకుండా చేసేందుకు వైసీపీ కుట్రపన్నిందని ఆరోపించారు. నారా లోకేష్‌ ధర్నా చేస్తుండగానే వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. వైసీపీ కార్యర్తలు కూడా ప్రతిగా ధర్నాకు దిగారు. ఇరుపక్షాల కార్యకర్తలు పరస్పరం తోసుకుంటూ నినాదాలు చేశారు. వెంటనే ఎస్పీ విజయారావు వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. వైసీపీ కార్యకర్తలపై లాఠీలకు పని చెప్పారు. 
Read Also : APలో ఓట్ల వర్షం : 80 శాతం పోలింగ్!